Viral News: చిరు చినుకులే మహావృక్షాన్ని తడుపుతాయి.. చిన్న చిన్న మొత్తాలే కొండంత పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తూ ఉంటాయి.. అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. నిత్య జీవితంలో పెద్దగా పట్టించుకోని.. రూ.10 నాణేలను రోజూ పొదుపు చేస్తూ.. ఏకంగా లక్ష రూపాయలకు పైగా అద్భుతమైన స్కూటర్‌ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు..
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట చెందిన బొడ్డు రవి జోసెఫ్ అనే వ్యక్తికి సొంతంగా ఒక స్కూటీ కొనుగోలు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక.. ఈ కలను సాకారం చేసుకునేందుకు ఆయన స్థానిక హోండా షోరూమ్‌కు వెళ్లాడట.. అయితే, ఆయన కొనుగోలు చేసే స్కూటర్ రూ.1.23 లక్షలను నోట్ల రూపంలో కాకుండా.. చిన్న చిన్న సంచుల్లో రూ.10 నాణేల రూపంలో తీసుకురావడంతో అక్కడున్న షోరూమ్ యజమానితో పాటు పని చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట..
నిత్యవసర సరుకులతో పాటు కూరగాయలు కొనుగోలు చేయడానికి లేదా ఇతర పనుల కోసం బయటకు వెళ్లిన.. ప్రతిసారీ చిల్లర రూపంలో చేతికి వచ్చిన రూ.10 నాణేలను ఖర్చు చేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టేవారట.. ఇలా రోజు వచ్చిన నాణేలను పక్కనపెడుతూ.. ఏకంగా మూడేళ్లపాటు వాటిని పొదుపు చేశారట.. ఇలా మొత్తం రూ.1.23 లక్షల వరకు జమైపోయాయట.. అనుకున్నట్లుగానే హోండా యాక్టివా స్కూటీని కొనుగోలు చేసేందుకు ఆ కాయిన్ల సంచులను షోరూమ్‌కు తీసుకొచ్చారట..
సంచుల్లో తీసుకు వచ్చిన వేలాది రూ.10 నాణేలను చూసిన షోరూమ్ సిబ్బంది ముందుగా ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత ఎంతో ఓపికగా వాటిని లెక్కించడం మొదలు పెట్టారట. పలువురు సిబ్బంది గంటల తరబడి శ్రమించి.. వాటిని పూర్తి లెక్కపెట్టారట.. ఆ తర్వాత బిల్ పే చేసి.. రవి జోసెఫ్ స్కూటీని పొందాడట..
డబ్బు ఎంత సంపాదిస్తున్నామన్నది కాదని.. అనుకున్న లక్ష్యం కోసం క్రమశిక్షణతో ఎంత జాగ్రత్తగా పొదుపు చేస్తున్నామన్నదే ముఖ్యమని.. రవి జోసెఫ్ చాటిచెప్పారు. చిన్న మొత్తాలను అలవాటుగా దాచుకుంటే జీవితంలో పెద్ద కోరికలను కూడా నెరవేర్చుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది.