• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /ప్రభుత్వ ఉద్యోగం కోసం 17 ఏళ్ల పోరాటం.. కోర్టుల చుట్టూ తిరిగి చివరకు కాంట్రాక్ట్ కొలువులేనా? DSC-2008 అభ్యర్థుల ఆవేదన..!!

ప్రభుత్వ ఉద్యోగం కోసం 17 ఏళ్ల పోరాటం.. కోర్టుల చుట్టూ తిరిగి చివరకు కాంట్రాక్ట్ కొలువులేనా? DSC-2008 అభ్యర్థుల ఆవేదన..!!

DSC-2008: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులకు డీఎస్సీ-2008 ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఉపాధ్యాయులుగా స్థిరపడాలనే లక్ష్యంతో దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు, ప్రభుత్వ నిర్ణయాల కోసం ఎదురుచూపులు, నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాల మధ్య కాలాన్ని గడిపారు.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 09, 2026, 04:18 PM IST|Updated: Oct 09, 2026, 04:43 PM IST
joinshare
ప్రభుత్వ ఉద్యోగం కోసం 17 ఏళ్ల పోరాటం.. కోర్టుల చుట్టూ తిరిగి చివరకు కాంట్రాక్ట్ కొలువులేనా? DSC-2008 అభ్యర్థుల ఆవేదన..!!
Image Credit: DSC-2008

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
25 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూపులు.. బాధిత రైతుల ఆందోళన!

25 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూపులు.. బాధిత రైతుల ఆందోళన!

2

Tirumala Brahmotsavam: తిరుమలకు ఉత్సవ శోభ.. బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు

3

నవరాత్రి ఉపవాసం ఉంటున్నారా? ఏం తినాలి? ఏవి తినకూడదు? 9 రోజుల రోజువారీ ఫుడ్ గైడ్!

4

అక్టోబర్ 9న విష యోగం.. ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

5

కరెంట్ బిల్లు సున్నా చేసే సూపర్ స్కీమ్.. రూ.78 వేల సబ్సిడీతో ఎలా పొందాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

DSC-2008: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటూ పోటీ  పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది  నిరుద్యోగులకు డీఎస్సీ 2008 ఒక చేదు జ్నాపకంగా మిగిలింది. ఉపాధ్యాయులుగా స్థిరపడాలనే లక్ష్యంతో దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు, ప్రభుత్వ నిర్ణయాల కోసం ఎదురుచూపులు, నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాల మధ్య కాలాన్ని గడిపారు. చివరకు ఉద్యోగాలు లభించినా.. అవి రెగ్యులర్ పోస్టులు కాకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పరిమితమయ్యాయి. దీంతో జీవితంలో కీలకమైన దశను ఉద్యోగం కోసం వెచ్చించిన అభ్యర్థులకు పూర్తిస్థాయి సంతృప్తి దక్కలేదు.

ఒక ఉద్యోగ నియామకం చుట్టూ మొదలైన వివాదం దాదాపు రెండు దశాబ్దాలకు చేరువవడం ప్రభుత్వ నియామక వ్యవస్థలోని సమస్యలను మరోసారి వెలుగులోకి తెస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనల్లో మార్పులు చేయడం, వాటిపై న్యాయస్థానాల్లో సుదీర్ఘ విచారణలు జరగడం, తుది పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి రావడం.. ఇవన్నీ అభ్యర్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయి.

నోటిఫికేషన్‌తో మొదలైన వివాదం:
2008లో ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. బీఎడ్, డీఎడ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలోనే నియామక ప్రక్రియలో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. 2009 జనవరి 29న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 28 ద్వారా ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఎడ్ అభ్యర్థులకు కేటాయించేలా నిబంధనలు మార్చింది.

అప్పటికే నోటిఫికేషన్ ఆధారంగా ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న బీఎడ్ అభ్యర్థులకు ఈ నిర్ణయం ఆందోళన కలిగించింది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత అర్హతలు లేదా పోస్టుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలను మార్చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నను వారు లేవనెత్తారు. తమకు అన్యాయం జరుగుతోందని భావించిన పలువురు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియలోని వివాదం న్యాయపోరాటంగా మారింది.

ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు..
బీఎడ్ అభ్యర్థుల పోరాటం ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌తో మొదలై హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు వరకు సాగింది. 30 శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించిన అంశంపై వివిధ దశల్లో భిన్నమైన న్యాయపరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో హైకోర్టు ఈ కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, అనంతరం సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసింది.

ఈ పరిణామాల మధ్య 2010లో నియామకాలు పూర్తయ్యాయి. అయితే పోస్టుల కేటాయింపు, రిజర్వేషన్ అమలు, ఎంపికలో అనుసరించిన విధానానికి సంబంధించిన వివాదం మాత్రం ముగియలేదు. ఉద్యోగ నియామకాలు జరిగినప్పటికీ, తమకు న్యాయం జరగలేదని భావించిన అభ్యర్థులు న్యాయపోరాటాన్ని కొనసాగించారు. ఒకవైపు ఉద్యోగాల కోసం ఎదురుచూపులు, మరోవైపు కేసుల విచారణ.. ఇలా వారి జీవితాల్లో అనిశ్చితి కొనసాగింది.

2017లో కీలక మలుపు:
ఈ వివాదంలో 2017 ఫిబ్రవరి 8 కీలకమైన రోజుగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వం తరఫున చేసిన ప్రకటన కేసు దిశను మార్చింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా 30 శాతం రిజర్వేషన్ అమలు కాలేదని, అభ్యర్థుల నియామకాలు సాధారణ మెరిట్ ఆధారంగా జరిగాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, అభ్యర్థులకు అన్యాయం జరగలేదనే అభిప్రాయంతో సంబంధిత రిట్ పిటిషన్లను ముగించింది. దీంతో వివాదానికి పరిష్కారం లభించినట్లు కనిపించింది. కానీ కొందరు అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ తరఫున చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితులకు సరిపోవడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్ అమలుకు సంబంధించిన అసలు వివరాలు బయటపడాలనే లక్ష్యంతో మరోసారి తమ ప్రయత్నాలను ప్రారంభించారు.

సమాచార హక్కుతో మళ్లీ తెరపైకి:
తమ వాదనలకు ఆధారాలు సేకరించేందుకు అభ్యర్థులు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ శాఖల నుంచి రికార్డులు సేకరించి, నియామకాల్లో 30 శాతం కేటాయింపు అమలుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఈ ప్రయత్నాలతో వివాదం మరోసారి న్యాయస్థానాల ముందుకు వెళ్లింది.

2021లో హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టి, పాత రిట్ పిటిషన్లను తిరిగి పరిశీలించే దిశగా చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలా ఒక దశలో ముగిసినట్లుగా కనిపించిన కేసు మళ్లీ విచారణకు రావడంతో అభ్యర్థుల్లో న్యాయం లభిస్తుందనే ఆశలు చిగురించాయి. అయితే అప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభమై సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతి న్యాయపరమైన మలుపు వారి నిరీక్షణను మరింత పెంచింది.

15 ఏళ్ల తర్వాత పరిష్కారానికి సూచన:
ఈ వివాదంపై 2023 మే 4వ తేదీన సుప్రీంకోర్టు చేసిన పలు కీలక సూచనలు మరో కీలక పరిణామంగా మారాయి. ఇప్పటికే 15 సంవత్సరాలకు పైగా సమయం గడిచిన నేపథ్యంలో అనవసర జాప్యం లేకుండా మెరిట్ ఆధారంగా సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ కోర్టు సూచించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఒక ముగింపు లభిస్తుందన్న ఆశను రేకెత్తించింది ఈ పరిణామం. అయితే న్యాయమైన పరిష్కారం కోసం గడిచిన ఈ కాలాన్ని వెనక్కి తీసుకురావడం అసాధ్యం. ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కోల్పోయిన వయస్సు, ఇతర ఉద్యోగ అవకాశాలు.. అర్థిక స్థిరత్వం వంటి అంశాలకు సమాధానం మాత్రం చెప్పాలి. న్యాయస్థానాల్లో విజయం సాధించినా, ఉద్యోగం కోసం వెచ్చించిన జీవితకాలం తిరిగి రాదనే వాస్తవం ఈ వ్యవహారంలో ప్రధానంగా కనిపిస్తోంది.

ఏపీ, తెలంగాణలో వేలాది మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు:
సుదీర్ఘకాలం తర్వాత వివాదానికి ముగింపు పలికే ప్రయత్నంలో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2021 జూన్ 21న జారీ చేసిన జీవో నంబర్ 39 ద్వారా 2,193 మంది బీఎడ్ అభ్యర్థులకు కనీస టైమ్‌స్కేల్‌తో కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ చేపట్టారు.


తెలంగాణలోనూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నియామకాలకు సంబంధించి చర్యలు ముందుకు సాగాయి. 2025 ఫిబ్రవరి 14న జారీ చేసిన జీవో నంబర్ 14 ద్వారా 13,882 మంది అభ్యర్థులకు నెలకు రూ.31,040 పారితోషికంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్జీటీ ఉద్యోగాలు కల్పించారు. ఇరు రాష్ట్రాలు తీసుకన్న ఈ నిర్ణయాలతో ఎన్నో ఏండ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉపాధి లభించినా.. రెగ్యులర్ ఉద్యోగం దక్కకపోవడంతో నిరాశే మిగిలింది.

ఉద్యోగం కోసం ఇన్నేళ్లుగా పోరాడిన తర్వాత చివరకు కాంట్రాక్ట్ నియామకాలతోనే సరిపెట్టుకోవాల్సి రావడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనే లక్ష్యంతో సాగిన ప్రయాణం తాత్కాలిక ఉపాధితో ముగియడం తమకు పూర్తి న్యాయం జరిగినట్లు అనిపించడం లేదని వారు భావిస్తున్నారు.

రెగ్యులర్ ఉద్యోగాలకు అడ్డంకులేమిటి?
బీఎడ్ అర్హత కలిగిన అభ్యర్థులను ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించే అంశంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు కీలకంగా మారాయి. ప్రాథమిక స్థాయి బోధనకు అవసరమైన అర్హతల విషయంలో చోటుచేసుకున్న న్యాయపరమైన మార్పులు కూడా ఈ నియామకాలపై ప్రభావం చూపాయి.

ఈ నేపథ్యంలో డీఎస్సీ-2008 బీఎడ్ అభ్యర్థుల వ్యవహారాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అభ్యర్థుల దృష్టిలో ప్రధాన ప్రశ్న వేరుగా ఉంది. నోటిఫికేషన్ సమయంలో ఉన్న నిబంధనల ఆధారంగా ఉద్యోగం కోసం ప్రయత్నించిన తమకు, నియామకాల్లో జాప్యం జరగకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదనే ప్రశ్నకు సమాధానం కావాలని వారు కోరుతున్నారు.రెగ్యులర్ హోదా కల్పించడంలో ఉన్న న్యాయపరమైన, పరిపాలనాపరమైన పరిమితులు ఏవైనా కావచ్చు. వ్యవస్థలో తలెత్తిన వివాదాలతో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను  పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్ కొనసాగుతోంది.

వయసు పెరిగింది.. బాధ్యతలు పెరిగాయి:
2008లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన సమయంలో చాలామంది అభ్యర్థులు తమ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నారు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చు.. కుటుంబానికి అండగా నిలవచ్చని అభ్యర్థులు ఆశపడ్డారు. కానీ ఏళ్లు గడిచేకొద్దీ వారి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కుటుంబ బాధ్యతలు పెరిగాయి. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, ఆర్థిక అవసరాలు పెరిగాయి. అదే సమయంలో వయసు పెరగడంతో ఇతర ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలు కూడా పరిమితమయ్యాయి.

ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూ, న్యాయపోరాటం కొనసాగిస్తూ గడిపిన సమయం తమ జీవితంలో తిరిగి రాదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఉద్యోగం లభించినా, ఆశించిన స్థాయిలో భద్రత, హోదా లభించకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. ఇన్నేళ్ల నిరీక్షణకు తగిన ఫలితం దక్కిందా అనే ప్రశ్న వారిని వెంటాడుతోంది.

డీఎస్సీ-2008 అభ్యర్థుల సమస్య ఇప్పుడు కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాలేదు. నియామక ప్రక్రియలో జరిగిన జాప్యానికి బాధ్యత ఎవరిది? అభ్యర్థులు కోల్పోయిన విలువైన సంవత్సరాలకు పరిహారం ఎలా కల్పించాలి? కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే మార్గాలేమిటి? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Telugu News
Telangana News