SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Harish Rao: అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే రేవంత్ రెడ్డికే ఇవ్వాలి: హరీశ్‌ రావు

Harish Rao Explains Facts About Miyapur Lands: మియాపూర్‌ భూముల వివాదంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక విషయాలు వెల్లడించారు. మియాపూర్‌ భూములు కాపాడిందే బీఆర్‌ఎస్‌ పార్టీ అని ప్రకటించారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు తెలిపారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 31, 2026, 10:13 PM IST | Updated: Oct 31, 2026, 10:22 PM IST
Image Credit: Harish Rao Press Meet
Join

Miyapur Lands: 'అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. అబద్ధానికి అంగీ లాగు తొడిగితే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కే ఉంటది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. వంటంతా మేము వండితే.. చివర్లో గంట తిప్పి నేనే వండినా అంటున్నాడని తెలిపారు. ఇది ఓట్ చోరీ కాదు, పక్కా క్రెడిట్ చోరీ అని అభివర్ణించారు. జడ్జిమెంట్ కాపీ చేతికి రాకముందే మియాపూర్ భూములు విక్రయించమని కలెక్టర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడని విమర్శించారు.

మియాపూర్‌ భూములపై ఎవరి దగ్గర అడ్వాన్స్‌లు తీసుకున్నావ్? అని రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు ప్రశ్నించారు. 'మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమి కేసు 2010లో కాంగ్రెస్ హయాంలో ఓడిపోయింది. నాడు ఏజీని కోర్టుకు పంపకుండా చిన్న జీపీని పంపి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు తెచ్చారు' అని తెలిపారు.

మేం చేసింది ఇదే
'2017 మే 19న కేసీఆర్ ఆదేశాలతో దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను నియమించాం. 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బీఆర్ఎస్ విజయం. 2023 ఆగస్టు 1న సుప్రీంకోర్టులో 142 ఎకరాలు ప్రభుత్వానివేనని తుది తీర్పు  అప్పుడు ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ఓడిపోయిన భూమిని గెలిపించింది మేము, నిందలు మాత్రం మాపైనే' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు.

'30 ఏళ్ల గ్రేహౌండ్స్ ప్రహరీ గోడను రాత్రికి రాత్రే కూల్చేశారు. రెండు రోజుల్లో లోపలికి కొత్త గోడ కట్టారు టెండర్ ఎవరిచ్చారు?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. '10 ఎకరాల 10 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు వదిలేశారు. మార్కెట్ విలువ రూ. 45.39 కోట్లు, కన్సిడరేషన్ వాల్యూ సున్నా. 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో ఒక్క రూపాయి కూడా కట్టలేదు. డ్రీమ్ వ్యాలీ సంతోష్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్, వెంటనే మరో 20 రిజిస్ట్రేషన్లు. ఎకరం రూ. 100 కోట్లు పలికే చోట రూ. 1,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టారు' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తీవ్ర ఆరోపణలు చేశారు.

'భూభారతిలో ఈ రోజుకూ ఆ భూమి గ్రేహౌండ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేరు మీదే ఉంది. రేవంత్‌ రెడ్డి కనుసన్నల్లో కాకపోతే గ్రేహౌండ్స్ గోడ కూల్చే దమ్ము ఎవరికి ఉంటుంది?. ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన మరో 10 ఎకరాల నోటిఫికేషన్ రద్దు అప్పీల్‌కు వెళ్లలేదు. జడ్జి పేరా 134లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వొచ్చని రాసినా మూడు నెలలుగా కదలిక లేదు. మంచిరేవులలో మొత్తంగా రూ. 2,000 కోట్ల కుంభకోణం' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు.

'మియాపూర్ కేసు సుప్రీంకోర్టులో 192 సార్లు విచారణకు వచ్చింది. అందులో 86 సార్లు వాదించింది బీఆర్ఎస్ నియమించిన వైద్యనాథన్. కాంగ్రెస్ వచ్చాక జరిగింది కేవలం 11 విచారణలు మాత్రమే. మియాపూర్ తీర్పునకు పునాది 2023లో మేము గెలిచిన ట్రినిటీ తీర్పులోని పేరా 93. భూపాలపల్లి అటవీ భూముల కేసును టీడీపీ, కాంగ్రెస్ 20 ఏళ్లు పట్టించుకోలేదు. 2021లో అక్రమార్కులను అరెస్టు చేసి జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వమే. భూమి కట్టబెట్టే ఉద్దేశమే ఉంటే వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తాం?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ప్రశ్నించారు.

'2024 ఏప్రిల్ 18న తీర్పు అధికారంలోకి వచ్చి మూడు నెలలకే రేవంత్ గెలిచాడా? ఐఎంజీ బిల్లీరావుకు ఎకరం రూ.50 వేలకు 850 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబే. ఆనాడు ఆ టీడీపీ ముఠాలో రేవంత్ రెడ్డి భాగస్వామి కాదా?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. 'కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికి జింకలను ఆగం చేసినందుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో కుదువపెట్టారు. రూ. 10 వేల కోట్ల అప్పు కోసం ముంబై బ్రోకర్‌కు రూ. 400 కోట్ల కమిషన్. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES