Harish Rao: గణేశ్ నిమజ్జన విద్యార్థుల మృతిపై హరీశ్ రావు దిగ్భ్రాంతి.. ఉత్సవాలపై కీలక సూచనలు
Harish Rao Express Condolence To Ganesh Immersion Students Death Incident: వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో పొరపాటున చెరువు నీటిలో పడి ఆరుగురు విద్యార్థులు మరణించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై వినాయక నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని ఆదేశించారు.
Ganesh Immersion Death Incident: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు పోవడంపై బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతికి సంతాపం ప్రకించిన ఆయన ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఈ మరణాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ప్రకటించారు. పండుగ వాతావరణంలో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు.
పటాన్‌చెరులో చిన్నారుల మృతి బాధాకరం.. భద్రతా లోపాల వల్లే ఈ దుర్ఘటన మాజీ మంత్రి హరీశ్ రావు వివరణ ఇచ్చారు. పటాన్ చెరు మండలం పెద్ద కంజర్ల చెరువు వద్ద వినాయక నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు నీటమునిగి ప్రాణాలు కోల్పోవడంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'చనిపోయిన పిల్లలంతా ఒక అనాథ ఆశ్రమానికి చెందిన వారు కావడం మరింత బాధాకరం. పండుగ పూట ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆశ్రమ నిర్వాహకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నిమజ్జనం వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. బాధిత ఆశ్రమాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనాలు జరుగుతుండడంతో అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనాలని, ఆశ్రమ నిర్వాహకులకు అండగా నిలవాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. నిమజ్జనాలకు వెళ్లే యువత, ప్రజలు నీటి కుంటలు, చెరువుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. పండుగ వాతావరణంలో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.