ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లలో ఇకపై రెగ్యులర్ బస్సులు..
Good News for Telangana RTC Passengers: దసరా పండుగను పురస్కరించుకుని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం బస్సులను విజయవంతంగా నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది.
RTC Passengers: హైదరాబాద్ మహా నగరం నుంచి దసరా సెలవుల కోసం సొంతూళ్లకు ఒక్కొక్కరుగా బయలుదేరుతున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను నడపనున్నారు. దసరా ప్రత్యేక బస్సుల నిర్వహణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు.
బతుకమ్మ, దసరా పండగల రద్దీని ఆర్టీసీ ప్రత్యేక ఆదాయ అవకాశంగా మలుచుకుంటోంది. హైదరాబాద్ నగరంలో తక్కువ దూరాల్లో తిరిగే సిటీ బస్సులను సైతం సుదూర ప్రాంతాలకు మళ్లించి ప్రత్యేక సర్వీసులుగా నడుపుతోంది. రెగ్యులర్ సర్వీసులను స్పెషల్ సర్వీసులుగా మార్చి సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో ప్రయాణికులపై భారం పడుతోంది. మరోవైపు పండగ రద్దీతో సాధారణ బస్సులతోపాటు ప్రత్యేక సర్వీసులకూ భారీ గిరాకీ ఉంది.
హైదరాబాద్ నుంచి వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సత్తుపల్లి, మహబూబ్నగర్, నారాయణఖేడ్, ఆదిలాబాద్కు ప్రయాణికులు భారీగా తరలి వెళ్తున్నారు. పండుగ ముగిసిన అనంతరం తిరిగి నగరాలకు చేరుకునే ప్రయాణికుల కోసం కూడా ఇదే తరహాలో ప్రత్యేక బస్సు సర్వీసులను సిద్ధం చేయాలని ఆదేశించారు.
బస్ స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి వసతులు, పారిశుధ్యం, భద్రత విషయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రయాణికులు తమ ముందస్తు రిజర్వేషన్లను అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులందరూ ఆర్టీసీ సేవలనే వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.