Vangaveeti Radhakrishna: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు తీవ్ర రణరంగంగా మారాయి. అధికార మహా కూటమి అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవాలనే లక్ష్యంలో భాగంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులు చేయడం.. పోటీలో ఉండకుండా చేయడం వంటి కుట్రలు చేస్తుండడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ పోటీపై కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ తమకు ఇచ్చిన సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ మేయర్ అభ్యర్థిగా
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. అనంతరం మేయర్, మున్సిపల్ చైర్మన్లు, నగర పంచాయతీ చైర్మన్ల అభ్యర్థులను జనసేన పార్టీ విడుదల చేసింది. రాష్ట్రంలో కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో ఒకటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఇటీవల పార్టీలో చేరిన కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ మేయర్ అభ్యర్థిగా జనసేన ఎంపిక చేసింది. మేయర్ పదవి కోసమే ఆయన జనసేన పార్టీలో చేరారు. విజయవాడ నేపథ్యం కలిగిన రాధాకృష్ణకు ఓటు బ్యాంకు అత్యధికంగా ఉందని భావించి జనసేన పార్టీ అతడికి అవకాశం వచ్చింది. అయితే నిన్న కాక మొన్న పార్టీలో వచ్చిన అతడికి మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడాన్ని జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇక ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడును జనసేన పార్టీ ప్రకటించింది.
మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థులు
అమలాపురం: నల్లా శ్రీధర్
చిలకలూరిపేట: తోట రాజరాజేశ్వరి
గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు
నరసాపురం: కొత్తపల్లి శైలజ
నిడదవోలు: కల్లం జ్యోతి
పెడన: మట్టా శివపావని
పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
పుత్తూరు: డి. ఏలుమలై
సాలూరు: గొర్లె విజయకుమారి
సామర్లకోట: పిట్టా జానకి రామారావు
తెనాలి: తోటకూర వెంకట రమణారావు
తిరువూరు: పి. మాధవి
జెండా.. కండువా మార్చేసి
కాగా పలుచోట్ల జనసేన పార్టీకి కల్పించిన మున్సిపల్ స్థానాల్లో తెలుగుదేవం పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం ఇబ్బంది కలిగిస్తోంది. కొన్ని చోట్ల టీడీపీ నాయకులే జనసేన పార్టీలో చేరి అభ్యర్థులుగా పోటీ చేస్తుండడంతో జనసేన పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు జెండా.. కండువా మార్చేసి జనసేన పార్టీలో చేరి పోటీకి దిగుతున్నారు. ఈ పరిణామంతో ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పని చేసిన నాయకులకు తీవ్ర అవమానం అని జనసేన సైనికులు భావిస్తున్నారు.