Rain Alert To Telangana: ఎల్నినో ప్రభావంతో వేసవికాలం మాదిరి ఎండలు దంచికొడుతుండడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని వెల్లడించింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఉన్న సదరు ఉపరితల ఆవర్తనం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ద్రోణి శనివారం ఉదయం 05.30 గంటలకు బలహీనపడింది.
అయినా కూడా దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లుండి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఉరుములు, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ సందర్భంగా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
వాతావరణ మార్పులతో రంపచోడవరం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్లు, వెల్దుర్తి, డోన్, గుత్తి, బద్వేలు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పొదిలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గొట్టిప్రోలులో మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.