Telangana Auto Charges Hike: ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న ఆటో రిక్షాల రంగంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఆటో కార్మికులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 12 సంవత్సరాల తర్వాత ఆటో రిక్షా చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఆటో రిక్షాల ఛార్జీలను సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆటో ఛార్జీలు పెంచడంతో ఆటో కార్మికులకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటో రంగాన్ని కూడా కీలక భాగస్వామిగా ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ క్రమంలోనే 12 సంవత్సరాల తర్వాత ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆటో రిక్షా చార్జీలను ప్రభుత్వం సవరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 14.02.2014న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.20 ప్రకారం అమల్లో ఉన్న చార్జీలను ప్రభుత్వం సవరించింది. ఆటో డ్రైవర్ల జీవనోపాధి, పెరిగిన నిర్వహణ వ్యయాలు, ప్రయాణికుల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ ఈ చార్జీల సవరణ చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
సవరించిన ఆటో చార్జీలు
మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస చార్జీ: రూ.30
ప్రతి తదుపరి కిలోమీటర్‌కు: రూ.14
నిరీక్షణ చార్జీ: నిమిషానికి రూ.0.75
అర్హత కలిగిన సామాను ప్యాకేజీ చార్జీ: రూ.0.50
గరిష్ఠ సామాను పరిమితి: 100 కిలోలు
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీకి 1.5 రెట్లు
ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
ఆటో ఛార్జీలు పెంచిన అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్లు ప్రజా రవాణా వ్యవస్థలో కీలక భాగస్వాములని .. ఆటో డ్రైవర్ల సమస్యలు, జీవనోపాధి, సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందని వెల్లడించారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.