SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా? జీతాలు తీసుకుంటూ బడికి రాకపోవడమేంటి? 4,530 మంది టీచర్లు డుమ్మా..!!

Government Schools: సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎన్నో పథకాలు అమలు చేస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వల్ల విద్యావ్యవస్థ చిన్నభిన్నమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దాదాపు 4,530 మంది ఉపాధ్యాయులు బడికి డుమ్మా కొడుతున్నారన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 04, 2026, 11:04 AM IST | Updated: Oct 04, 2026, 11:05 AM IST
Image Credit: Government Schools
Join

Government Schools: నేటి బాలలను రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొందరు గురువులు..గురుతర బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఆన్ డ్యూటీ పేరుతో ఇతర శాఖల విధుల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. ఇలా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో ఓడీల రాజ్యం నడుస్తోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 4,530 మంది ఉపాధ్యాయులు ఆన్ డ్యూటీపై పనిచేస్తున్నారు. మరో 2,189 మంది ఉపాధ్యాయులు ఆన్ డ్యూటీ విధుల కోసం క్యూ కట్టారు. దీనికి సంబంధించిన అప్రూవల్ పెండింగ్ లో ఉంది. దీంతో బోధనేతర విధుల నుంచి వారంతా దూరంగా ఉండటంతో.. ఆయా సబ్జెక్టుల పాఠాల్లో విద్యార్థులు వెనకబడిపోతున్నారు.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ మొదలుకొని డీఈవో కార్యాలయాలు, సమగ్రశిక్ష ప్రాజెక్టుల వరకు కో-ఆర్డినేటర్లుగా, క్లరికల్ విధుల్లో ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. డిప్యుటేషన్ల ఎంపికలో కుల, సామాజిక వర్గాలు, రాజకీయ ఒత్తిళ్ల ఆధారంగా ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు గడువు ముగిసినా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే డిప్యుటేషన్లపై కొనసాగుతుండటం, కేవలం హాజరు పత్రాల ఆధారంగా హెచ్‌ఎంలు జీతాలు క్రమం తప్పకుండా డ్రా చేస్తుండటం విద్యాశాఖలోని లోపాలకు అద్దం పడుతోంది.

పుస్తకాల ముద్రణలో తప్పులు:
రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (SCERT) కొందరి కొమ్ముకాసే కేంద్రంగా మారిందనే విమర్శలు కూడా  వ్యక్తమవుతున్నాయి. ఐదేండ్ల గడువు ముగిసినా బీఈడీ కాలేజీ అధ్యాపకురాలు ఒకరు ఇక్కడే కొనసాగుతూ వ్యవస్థను శాసిస్తుండగా.. బదిలీ అయిన ఇంగ్లీష్ టీచర్ మళ్లీ వేరే విభాగంలోకి రావడం, వనపర్తి జిల్లాకు చెందిన మరో టీచర్ ఏండ్లుగా ఇక్కడే పాగా వేయడం చర్చనీయాంశంగా మారింది. సాంఘికశాస్త్రం పాఠ్యపుస్తకంలో పాత రాజ్యాంగ పీఠికను ముద్రించేంతటి తీవ్ర నిర్లక్ష్యం జరిగినా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, ఒకే టీచర్‌ను సంబంధం లేని ఇతర సబ్జెక్టుల జాతీయ శిక్షణలకు, ప్రీ-ప్రైమరీ ట్రైనింగ్‌కు పంపడం ఎస్సీఈఆర్‌టీలో జరుగుతున్న నెపోటిజానికి నిదర్శనంగా నిలుస్తోంది.

బడి దిక్కు చూడని సంఘాల నేతలు:
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఉన్న ఆన్‌డ్యూటీ  సదుపాయాన్ని పలువురు నేతలు అడ్డం పెట్టుకుని విధులకు పూర్తిగా దూరమవుతున్నారు. ఎలాంటి అధికారిక ఓడీ లేని చిన్న సంఘాల నాయకులు కూడా పాఠశాలల వైపు కూడా చూడటం లేదు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోనే ఇప్పటికే 181 మంది ఓడీపై పనిచేస్తుండగా, మరో 206 మంది ఓడీ కోసం దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఫేషియల్ రికగ్నిషన్ యాప్ షాకింగ్ వివరాలు:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.19 లక్షల మంది ఉపాధ్యాయులలో సగటున రోజుకు 20 వేల మంది  గైర్హాజరవుతున్నట్లు ఫేషియల్ రికగ్నిషన్ యాప్  డేటా స్పష్టం చేస్తోంది. భద్రాద్రి-కొత్తగూడెం, నారాయణపేట, మహబూబ్‌నగర్ అర్బన్, ట్రైబల్ జిల్లాల్లో హాజరుశాతం దారుణంగా పడిపోయింది. ఈ నెల 1న ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, లీవు పెట్టకుండా ఏకంగా 4,160 మంది టీచర్లు విధులకు డూమా కొట్టారు. వీటిలో వికారాబాద్ (378), రంగారెడ్డి (260), సూర్యాపేట (236) జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. మరొక 11,041 మంది అధికారికంగా లీవులు పెట్టారు.  ఇటీవల హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో నడిబొడ్డున ఉన్న స్కూళ్లలోనే ఒక్కరోజే 183 మంది టీచర్లు విధులకు హాజరుకాకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బోధనేతర విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలలకు పంపాలని, అనధికార గైర్హాజరు, అక్రమ డిప్యుటేషన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES