Telangana School Breakfast Program: తెలంగాణ ప్రభుత్వ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌కు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా భారీ సహకారం అందింది. నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు రెండు సంస్థలు సంయుక్తంగా రూ.9.17 కోట్ల విరాళాన్ని ప్రకటించాయి. జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (HKMCF)తో కలిసి ఈ విరాళం అందజేశాయి. ఈ నిధులతో రెండు జిల్లాల్లో ఆధునిక, అధిక సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ప్రతిరోజూ మొత్తం 70 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.
తెలంగాణలో ఏ చిన్నారి కూడా ఆకలి కారణంగా విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌కు ఈ భాగస్వామ్యం మరింత బలాన్ని అందించనుంది. జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాగర్ కర్నూల్ జిల్లాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుకు రూ.5.17 కోట్ల విరాళాన్ని అందించింది. సంస్థ సీఎండీ శేఖర్ రెడ్డి స్వస్థలం నాగర్ కర్నూల్ కావడంతో తన ప్రాంతంలోని పిల్లల విద్య, పోషకాహారానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ సహకారం అందించారు. ఈ కిచెన్ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 50 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు. తన స్వస్థలంలోని పిల్లల అభివృద్ధికి సంస్థ తరఫున సహకారం అందించడం ఈ ప్రాజెక్టులో ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఢిల్లీకి చెందిన చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వికారాబాద్ జిల్లాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుకు రూ.4 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ కిచెన్ ద్వారా వికారాబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 20 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. తెలంగాణలోని పిల్లల సంక్షేమం కోసం రాష్ట్ర సరిహద్దులకు అతీతంగా సంస్థ ఈ సహకారం అందించింది.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి, సంస్థ సీఈఓ, డైరెక్టర్ బి.అనిల్ బాబు, చైన్ ల్యాబ్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సమంత డే కలిసి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీకి చెక్కులను అధికారికంగా అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు సంస్థల ఉదార విరాళాలను అభినందించారు. తెలంగాణ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ నిర్వాహకులను ప్రశంసించారు.
ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస్ మాట్లాడుతూ.. జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు అందించిన విరాళాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమ్యూనిటీ కిచెన్ల ద్వారా ప్రతిరోజూ వేలాది మంది పిల్లలు కేవలం పుస్తకాలతోనే కాకుండా, కడుపునిండా పోషకాహారంతో పాఠశాలలకు చేరుకుంటారని పేర్కొన్నారు. తద్వారా వారు చదువుకోవడానికి, ఎదగడానికి అవసరమైన ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి తన స్వస్థలమైన నాగర్ కర్నూల్ పిల్లల కోసం పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం తమను ఎంతో కదిలించిందన్నారు. ఇది సమాజంపై ఆయనకున్న బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌కు నిలయంగా మార్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ దూరదృష్టి, కార్పొరేట్ దాతృత్వం, నిస్వార్థ సేవ కలిసినప్పుడు పిల్లల భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఒక స్వతంత్ర స్వచ్ఛంద సేవా సంస్థ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గత 13 ఏళ్లలో ప్రభుత్వ సంస్థలు, దాతల భాగస్వామ్యంతో పేదలకు 25 కోట్లకు పైగా ఉచిత, రాయితీ భోజనాలను అందించినట్లు ఫౌండేషన్ వెల్లడించింది. ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల నెట్‌వర్క్ ద్వారా ఈ సేవలను కొనసాగిస్తోంది. తెలంగాణలో ఇందిరమ్మ క్యాంటీన్లు, తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, భోజనామృత, సద్భిమార్ వంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అమలు భాగస్వామిగా పనిచేస్తోంది.
పిల్లల పోషకాహారం, విద్యలో పెట్టుబడులు పెట్టడం ద్వారా జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు తెలంగాణలో సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగమైన ఆకలి నిర్మూలన (SDG 2), నాణ్యమైన విద్య (SDG 4), అసమానతల తగ్గింపు (SDG 10) లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ఫౌండేషన్ పేర్కొంది.