Harish rao letter to Uttam kumar reddy over kaleshwaram project row: తెలంగాణలో రాజకీయాలు మరోసారి సాగునీటి ప్రాజెక్టుల చుట్టు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరంలో పంపు సెట్లను ఆన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన లేఖను రాశారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థను నిర్మించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగా 141 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను ఏర్పాటు చేశారన్నారు. గోదావరిలో వరద వచ్చినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లను నింపితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు గోదావరిలో భారీ వరద ప్రవాహం ఉన్నా, ఆ నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడంలో మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తోంది. నీళ్లు అందక పంటలు ఎండిపోతుంటే మీరు మాత్రం ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తూ పంటలు ఎండగొడుతున్నారు. గోదావరి జలాలను లిఫ్ట్ చేయకుండా చోద్యం చూస్తున్నారని తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ సర్కారు తీరుపై విమర్శలు చేశారు.
ఒకవైపు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతుంటే, మరోవైపు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 13 టీఎంసీలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇక్కడ 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అందుబాటులో ఉంది. మల్లన్న సాగర్ నిండుకుండలా మారితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు, మీరు చెబుతున్న మూసీ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుంది.
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోనూ 15 టీఎంసీలకు కేవలం 6 టీఎంసీలే ఉన్నాయన్నారు. ఇక్కడికి సైతం నీటిని ఎత్తిపోస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రయోజనం చేకూరుతుందని హరీష్ రావు తన లేఖలో పేర్కొన్నారు. ఎల్లంపల్లిలో నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తే మిడ్ మానేరు సహా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించడంతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా పూర్తి పరిష్కారం లభిస్తుంది. ఈ రిజర్వాయర్లను నింపడం వల్ల దాదాపు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి దోహదం చేసినట్లవుతుందని చెప్పుకొచ్చారు.
మరోవైపు మిడ్ మానేరు దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్.ఎం.డి.)లో ప్రస్తుతం 11 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి నీటిని తరలిస్తే కరీంనగర్, వరంగల్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లోని రైతులు, ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారన్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..సిద్దిపేట జిల్లా నర్మెట్టలో మా ప్రభుత్వ హయాంలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే రంగనాయక సాగర్‌లో నీళ్లు లేకపోవడం వల్ల పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ ఇబ్బందిగా మారింది.
ఈ పరిస్థితితో పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి కోసం రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటే, మీరు మాత్రం నదుల్లో వస్తున్న నీళ్లను లిఫ్ట్ చేయకుండా కిందకు వదిలిపెడుతున్నారని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం గోదావరి నదిలో ఎల్లంపల్లి వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని అన్ని మోటార్లను నడిపి నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా మీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్న నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. జలకళతో కనిపించాల్సిన రిజర్వాయర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయంటే దానికి కారణం నీటి నిర్వహణలో మీ ప్రభుత్వ వైఫల్యమన్నారు.
ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు మంత్రిగారు. ఎల్‌నినోను సాకుగా చూపకుండా, అందివచ్చిన గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా ఆన్-ఆఫ్ పద్ధతిలో కాకుండా 24 గంటల పాటు అన్ని మోటార్లు నడిపి జలాశయాలను నింపాలని డిమాండ్ చేస్తున్నాం.
రాజకీయాలను పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం ఆలోచించాలని, ప్రకృతిపై నెపం నెట్టి రైతులకు సాగు నీళ్లు ఇచ్చే బాధ్యత నుంచి తప్పించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నమంటూ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రికి, సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తు లేఖాస్త్రంను సంధించారు.