JNV Admissions 2027: ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన, క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను ఉన్నత విద్య వైపు నడిపిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని విద్యాశాఖ సూచిస్తోంది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో విద్యార్థులకు సాధారణ పాఠ్యాంశాలతో పాటు విజ్ఞానం, గణితం, భాషా నైపుణ్యాలు, పోటీ పరీక్షలకు అవసరమైన మౌలిక సామర్థ్యాలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలకు ప్రాధాన్యం లభిస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్య లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి విద్యాసంస్థలు మంచి అవకాశాలను అందిస్తున్నాయి.
ఇక్కడ చదివిన విద్యార్థులు భవిష్యత్తులో IITలు, NITలు, వైద్య విద్యాసంస్థలు, NEET, CLAT వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, అలాగే ఉన్నత విద్యా రంగంలోని అనేక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అవసరమైన విద్యా వాతావరణాన్ని పొందుతున్నారు. తద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించేందుకు మంచి పునాది ఏర్పడుతుంది.
తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు:
చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన సమాచారం అందకపోవడం వల్ల ఇటువంటి అవకాశాలను కోల్పోతున్నారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల అర్హతను పరిశీలించి, దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రవేశ పరీక్షకు ఎంపికైన విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం లభించడంతో పాటు, భవిష్యత్తులో IIT, NEET, CLAT తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవసరమైన అకడమిక్ పునాది ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఉపాధ్యాయుల పాత్ర కీలకం:
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 8వ, 10వ తరగతి విద్యార్థుల్లో అర్హత ఉన్న వారిని గుర్తించి, వారి తల్లిదండ్రులకు నవోదయ ప్రవేశ పరీక్షపై పూర్తి అవగాహన కల్పించాలి. పాఠశాల స్థాయిలోనే దరఖాస్తు గడువు, అర్హత, పరీక్ష విధానం, సిలబస్ తదితర అంశాలను విద్యార్థులకు వివరించి ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసేలా ప్రోత్సహించాలి.
ముఖ్యమైన వివరాలు:
ప్రవేశ తరగతులు: 9వ, 11వ తరగతులు
అర్హత: సంబంధిత తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు
దరఖాస్తుకు చివరి తేదీ: 15 అక్టోబర్ 2026
ప్రవేశ పరీక్ష తేదీ: 10 ఏప్రిల్ 2027
పరీక్ష సమయం: ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ప్రతి విద్యార్థి లక్ష్యం ఉన్నత విద్య కావాలి:
ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కూడా జాతీయ స్థాయి లష్యాలను అందుకోగలడనే నమ్మకాన్ని విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థితో అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేయించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ కోరుతోంది.
