Kavitha Bathukamma Celebrations: బహుజన తెలంగాణ కోసం మరోసారి బతుకమ్మ ఉద్యమ స్వరూపం కావాలని.. పేదింటి బిడ్డలకు అధికారంలో భాగస్వామ్యం రావాల్సిందే అని మాజీ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముక్కు పిండి అయినా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.వెయ్యి కోట్లు తెస్తామని ప్రకటించారు. రోహిత్ వేముల చట్టం తెస్తామన్న రాహుల్ గాంధీ ఏమైపోయాడు? అని ప్రశ్నించారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ.. నేడు కాంగ్రెస్ యూనివర్సిటీలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. అప్పటి బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామిగా ఉండడంతో మరోసారి క్షమాపణలు చెబుతున్నా అని ప్రకటన చేశారు.
ఆర్ట్స్ కళాశాల వద్ద బతుకమ్మ సంబరాలు
ఓయూ విద్యార్థుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరగ్గా.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల సంఘం కమిషనర్‌ను మార్చుడు కాదు.. మోదీని దించాలని.. వ్యవస్థను మార్చాలని కవిత తెలిపారు. 'ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటేనే తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తుంది. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఈ గడ్డ పోరాటాన్ని తెలంగాణ నేల తల్లి ఎన్నటికీ కూడా మర్చిపోదు' అని పేర్కొన్నారు.
బతుకమ్మ స్ఫూర్తితో పోరాటం
'ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చూపేందుకు బతుకమ్మ ఎత్తుకొని బయలుదేరాం. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ స్ఫూర్తి అయ్యింది. మళ్లీ బహుజన తెలంగాణ కావాలంటే అదే బతుకమ్మ స్ఫూర్తి మళ్లీ కావాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో ఏ పార్టీ ఉన్న సరే వారికి ఉస్మానియా విద్యార్థుల ఆశీర్వాదం కావాల్సిందేనని పేర్కొన్నారు. ఒక మహిళగా తాను కూడా పార్టీ పెట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు.
'ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన గురించి మాట్లాడుతున్నారు. కానీ మన ఆర్ట్స్ కాలేజ్ ముందు జంతర్ మంతర్ చూ మంతర్. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చి రూ.వెయ్యి కోట్లు ప్రకటించి ఆరు నెలలైంది. కానీ ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు' అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గుర్తుచేశారు. 'తెచ్చుకున్న తెలంగాణలో సమానత్వం, స్వేచ్ఛ, అందరికీ అధికారంలో ప్రాతినిధ్యం కావాలంటే మళ్లీ బతుకమ్మ ఉద్యమ స్వరూపమై ముందుకు రావాలి. మన బతుకమ్మలో వికసించే పూలలో స్వేచ్ఛ, స్వాంతంత్రం ఉంటుంది' అని కవిత తెలిపారు. 'బతుకమ్మ పండుగ అంటే ఏదో ఆడటం కాదు. దాని వెనుక ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి. మగపిల్లలు బతుకమ్మ పూలు కోసి తెస్తేనే బతుకమ్మ పేర్చే సంస్కృతి మనది. అదే విధంగా ఆడవాళ్లందరికీ అండగా ఉండాల్సిన బాధ్యత మగ పిల్లలందరికీ ఉంది' అని పేర్కొన్నారు.
ఓయూ కష్టాలపై సమరం
'ఒక్కో రూమ్‌లో 8 మంది ఉండే పరిస్థితి. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. కానీ మన దగ్గర కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో 74 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు. చాలా యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున ప్రొఫెసర్స్ కొరత ఉంది' అని మాజీ ఎంపీ కవిత వివరించారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 'ఆనాడు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఉండడంతో మళ్లీ క్షమాపణ చెబుతున్నా' అని మాజీ ఎమ్మెల్సీ కవిత మరోసారి క్షమాపణలు చెప్పారు. 'రూ.వెయ్యి కోట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి ముక్కు పిండి ఆ నిధులను వసూలు చేయాల్సిందే! జంతర్ మంతర్ మాదిరిగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉద్యమం చేద్దామా?' అని కవిత విద్యార్థుల మద్దతు కోరారు.
'యూనివర్సిటీలు అంటే నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీలుగా ఉండాలి. ఒక పీవీ, జార్జ్ రెడ్డి, గద్దర్, కిషన్ జీ, స్వర్ణక్క సహా రైట్ వింగ్‌లోని చాలా మంది ఉస్మానియా నుంచే వచ్చారు' అని గుర్తుచేశారు. 'వెయ్యి మెదళ్లు మాట్లాడాలి, లక్ష ఆలోచనలు సంఘర్షించాలి. అప్పుడే దేశంలో విప్లవం వస్తుంది. ఇక్కడ వెయ్యి యువ మెదళ్లు ఉన్నాయి. లక్షల ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడంతా ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నేను ఆ డిమాండ్‌ను అంగీకరించడం లేదు. మొత్తం సిస్టమ్ మారాలని కోరుతున్నా. ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేస్తే మళ్లీ మోడీకి నచ్చిన వ్యక్తిని పెట్టుకుంటారు. అందుకే సిస్టమ్ మారాలి' అని మాజీ ఎంపీ కవిత తెలిపారు. మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు రావాలని డిమాండ్ చేశారు. మోసం చేసే ఈవీఎంలను పక్కన పెట్టి పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భయపడకుండా అందరూ మాట్లాడాలని.. భయపడితే తెలంగాణ వచ్చేదా? అని విద్యార్థులకు కవిత ధైర్యం నూరిపోశారు.
'మళ్లీ విద్యార్థి సంఘాల ఎన్నికలు రావాలి. అప్పుడే యువతరానికి నాయకత్వం వస్తుంది. పేదింటి బిడ్డలకు అధికారం రావాలంటే నాయకులను తయారుచేసే యూనివర్సిటీల్లో లిబరల్ థింకింగ్ ఉండాలి. లేదంటే కేసీఆర్ బిడ్డ, కొడుకు, రేవంత్ రెడ్డి బిడ్డనే రాజకీయాల్లోకి వస్తారు' అని పేర్కొన్నారు. 'ఆనాడు రాహుల్ గాంధీ వచ్చి రోహిత్ వేముల చట్టం తెస్తానని చెప్పాడు. అశోక్ నగర్ వచ్చి జాబ్ క్యాలెండర్ వేస్తామని మాట ఇచ్చాడు. మరీ దాని గురించి ప్రశ్నించొద్దా?' అని ప్రశ్నించారు. 'విద్యార్థులు ఫాలోవర్స్‌గా ఉండటం కాదు. లీడర్స్‌గా తయారు కావాలి. ఎక్కడో కాక్రోచ్‌లు వచ్చారని కాదు మన దగ్గర అలాంటి నాయకత్వం ఎందుకు రావటం లేదో ఆలోచించాలి' అని విద్యార్థులకు మాజీ ఎమ్మెల్సీ కవిత సూచించారు.