SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

KTR: ఎన్నికల్లో పొత్తులపై మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన.. ఎవరితో పొత్తు అంటే?

KT Rama Rao Announces BRS Party No Alliance With BJP: రానున్న అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 17, 2026, 11:51 AM IST | Updated: Sep 17, 2026, 11:55 AM IST
Image Credit: KT Rama Rao
Join

Telangana Assembly Elections: అత్యంత ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రెండేళ్ల సమయం ఉండగానే బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటించారు. లోక్‌సభ స్థానాల పెంపు దామాషా ప్రకారం జరిగితే డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వడానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు.

హర్యానాలోని సోనిపట్‌లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో బుధవారం 'ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ -ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్' అనే అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కేటీఆర్‌ విద్యార్థులతోపాటు అధ్యాపకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాజకీయాలు, పాలన, సాంకేతికత తదితర అంశాలపై వారి ప్రశ్నలకు బదులు ఇచ్చారు.

2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ పై విధంగా సమాధానం ఇవ్వగా.. డీలిమిటేషన్ అంశంపై స్పందించారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని ప్రకటించారు. 'ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. మొత్తం లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో తమకు ఎలాంటి సమస్య ఉండదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

కృత్రిమ మేధస్సు (ఏఐ), సాంకేతిక మార్పులపై ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానమిస్తూ.. 'ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రతి సాంకేతిక మార్పుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోంది. మనం దాన్ని స్వీకరించి ముందుకు సాగాలి' అని సూచించారు. 'నిర్దిష్టత, అవకాశాలు అనే రెండు కాన్సెప్ట్‌ల ద్వారా తెలంగాణ అభివృద్ధి నమూనాను ఈ సందర్భంగా కేటీఆర్‌ వివరించారు.

'మౌలిక వసతులు, విశ్వసనీయమైన ప్రజా సేవల ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఒక నిర్దిష్టమైన వాతావరణం కల్పించడంతోపాటు ఇన్నోవేషన్, వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తూ ఒక ఇకోసిస్టమ్‌ను సృష్టించి, కొత్త అవకాశాలకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా నిర్మించాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి కేటీఆర్ వివరించారు.

'కరువు ప్రభావిత తెలంగాణ ప్రాంతాలకు గోదావరి జలాలను ఎలా తరలించాలనే చారిత్రక సవాలుకు ఇంజినీరింగ్ పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి 2014–15లో సుమారు 44.4 లక్షల టన్నులు ఉంటే.. 2023–24లో అది 168.8 లక్షల టన్నులకు పెరిగిందని వెల్లడించారు. తెలంగాణలో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్ వంటి సంస్థల పాత్రను వివరించారు.

వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, మహిళలకు అవకాశాలు కల్పించడం, నమూనా రూపకల్పన, హార్డ్‌వేర్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడం, యువతను పరిశ్రమలతో అనుసంధానం చేయడంలో వీటి పాత్రను మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఇంక్యుబేషన్, నమూనా రూపకల్పన నుంచి మార్కెట్‌కు సిద్ధమైన సంస్థగా ఎదిగిన స్కైరూట్‌ను తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థకు ఉదాహరణగా ప్రస్తావించారు. పరిమితులను సమస్యలుగా చూడకుండా నిరంతరం నేర్చుకోవడం, మెరుగుపడడం, వాటిని అమలు చేయడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES