Sircilla Development: తొలిసారి సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్నలు వేశారు. సిరిసిల్లకు స్వాగతం పలుకుతూనే వీటికి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. సిరిసిల్ల పర్యటన చేస్తున్న రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు. 'నేతన్న, రైతన్న, విద్యార్థి, అన్ని వర్గాల సమస్యలకు సమాధానం చెప్పాలి. హామీల అమలుపై స్పష్టమైన తేదీలు ప్రకటించాలి' అని రేవంత్ రెడ్డిని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు.
ప్రతి వర్గాన్ని, ప్రతి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని.. 420 హామీల్లో ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నాయకులు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. వాటిలో వాస్తవం ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను రుజువు చేయలేకపోతే సిరిసిల్ల ప్రజలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు.
'నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసింది. స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో పాటు అనేక ప్రభుత్వ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించాం' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
'నేతన్నల రూ.60 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? పాత బకాయిలన్నీ చెల్లించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రూ.300 కోట్ల బకాయిల్లో ఇంకా రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉంది. నేతన్నలకు చెల్లించిన 10 శాతం యార్న్ సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో యార్న్ డిపో ఏర్పాటు చేయాలని కోరారు. రైతన్నల సమస్యలకు సమాధానం చెప్పాలని.. రైతుబంధు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకురావాలని.. ఆక్వా హబ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా కొత్త పరిశ్రమల ఏర్పాటు సంగతి పక్కన పెడితే, ఇప్పటికే మంజూరైన పరిశ్రమలను పూర్తి చేసే చర్యలు కూడా చేపట్టలేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని కోట్లు కేటాయిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ విద్యాసంస్థలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సిరిసిల్ల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు.
'పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ ద్వారా కొత్త పనులు మంజూరు చేయాలి. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రోడ్లు, ఎన్ని భవనాలు మంజూరు చేస్తారు? వెంటనే ఎన్ని నిధులు విడుదల చేస్తారు? ప్రకటించాలి' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల వైద్యరంగానికి మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. సర్దాపూర్‌లోని సిరిసిల్ల బెటాలియన్ పోలీసు కుటుంబాలు ఎన్నికల్లో ఇచ్చిన ‘ఏక్ పోలీసు’ హామీని అమలు చేయాలని కోరుతున్నాయని కేటీఆర్ తెలిపారు.
'బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, కంటి వెలుగు వంటి పథకాల ద్వారా పేదలు, మహిళలు, వృద్ధులకు సంక్షేమ ఫలాలు అందించాం. చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీబంధు వంటి పథకాల ద్వారా వివిధ వర్గాలకు జీవనోపాధి కల్పించాం. సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు రూ.250 కోట్లతో 4,500 ఇళ్ల నిర్మాణం చేపట్టాం' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. అన్ని వర్గాల సంక్షేమంపై నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.