రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం పరిమితులను పెంచడంతో పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు, త్వరలోనే ఇందిరమ్మ భీమా పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువస్తామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే సుమారు 1.06 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ దేశంలోనే ఒక నమూనాగా నిలుస్తున్నామని ఆయన గర్వంగా చెప్పారు.
ఖమ్మంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ బీమా పథకం కేవలం కొందరికే పరిమితం కాకుండా, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ పథకం వర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న రైతు బీమా పథకం ద్వారా రైతు మరణించిన సందర్భంలో అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం రైతులకు ఆ పథకం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, అదే తరహాలో ఇందిరమ్మ భీమా పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద ఒక నిర్దిష్ట వయస్సు పరిమితిని నిర్ణయించి, ఆ పరిమితిలోపు ఉన్న వ్యక్తులు ప్రమాదవశాత్తూ లేదా యాక్సిడెంటల్‌గా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం పక్కాగా ప్లాన్ చేస్తోంది.
తెలంగాణలోని రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలకు, ముఖ్యంగా ఇంటి పెద్ద మరణించినప్పుడు ఎదురయ్యే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఇందిరమ్మ బీమా పథకం కొండంత అండగా నిలుస్తుంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఐసి వంటి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. వయస్సు పరిమితి ఇతర నిబంధనలను ఖరారు చేసిన తర్వాత, లబ్ధిదారుల పేరు మీద బీమా సొమ్మును జమ చేస్తారు. దీనివల్ల ప్రమాదాలు లేదా ఇతర కారణాల వల్ల మరణించినప్పుడు ఆ బీమా మొత్తాన్ని లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సులభంగా పొందే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, వాటి గురించి ప్రజలకు మరింత స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. అందుకే బీఎల్ఏల ద్వారా ఈ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని కోరారు. ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, ఇందిరమ్మ భీమా పథకం కూడా అమల్లోకి వస్తే అది పేద, మధ్యతరగతి ప్రజలకు అమితమైన మేలు చేస్తుంది. ఈ పథకం గురించి మొదటి నుంచే సరైన ప్రచారం కల్పించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని, ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన నమ్మకంగా పేర్కొన్నారు.