SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. 'ఇందిరమ్మ బీమా' ప్రారంభ తేదీ ఖరారు! డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ కొత్తగా శ్రీకారం చుట్టబోతోంది. రాబోయే నవంబర్ 19వ తేదీన ప్రభుత్వం 'ఇందిరమ్మ బీమా పథకం' అధికారికంగా ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఖమ్మంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జరిగిన కాంగ్రెస్ బీఎల్ఏల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. అలాగే, పార్టీ కోసం గ్రామ స్థాయిలో నిరంతరం కష్టపడే ప్రతి కార్యకర్తను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని భరోసా ఇచ్చారు.

Written By Renuka Godugu
Published: Sep 28, 2026, 08:11 AM IST | Updated: Sep 28, 2026, 08:14 AM IST
Image Credit: Indiramma Bima Scheme Telangana
Join

రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం పరిమితులను పెంచడంతో పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు, త్వరలోనే ఇందిరమ్మ భీమా పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువస్తామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే సుమారు 1.06 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ దేశంలోనే ఒక నమూనాగా నిలుస్తున్నామని ఆయన గర్వంగా చెప్పారు.

ఖమ్మంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ బీమా పథకం కేవలం కొందరికే పరిమితం కాకుండా, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ పథకం వర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న రైతు బీమా పథకం ద్వారా రైతు మరణించిన సందర్భంలో అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం రైతులకు ఆ పథకం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, అదే తరహాలో ఇందిరమ్మ భీమా పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద ఒక నిర్దిష్ట వయస్సు పరిమితిని నిర్ణయించి, ఆ పరిమితిలోపు ఉన్న వ్యక్తులు ప్రమాదవశాత్తూ లేదా యాక్సిడెంటల్‌గా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం పక్కాగా ప్లాన్ చేస్తోంది.

తెలంగాణలోని రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలకు, ముఖ్యంగా ఇంటి పెద్ద మరణించినప్పుడు ఎదురయ్యే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఇందిరమ్మ బీమా పథకం కొండంత అండగా నిలుస్తుంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఐసి వంటి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. వయస్సు పరిమితి ఇతర నిబంధనలను ఖరారు చేసిన తర్వాత, లబ్ధిదారుల పేరు మీద బీమా సొమ్మును జమ చేస్తారు. దీనివల్ల ప్రమాదాలు లేదా ఇతర కారణాల వల్ల మరణించినప్పుడు ఆ బీమా మొత్తాన్ని లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సులభంగా పొందే అవకాశం ఉంటుంది.

 

ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, వాటి గురించి ప్రజలకు మరింత స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. అందుకే బీఎల్ఏల ద్వారా ఈ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని కోరారు. ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, ఇందిరమ్మ భీమా పథకం కూడా అమల్లోకి వస్తే అది పేద, మధ్యతరగతి ప్రజలకు అమితమైన మేలు చేస్తుంది. ఈ పథకం గురించి మొదటి నుంచే సరైన ప్రచారం కల్పించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని, ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన నమ్మకంగా పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES