SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సమ్మక్క సాగర్ బ్యారేజ్ విశేషాలు.. తెలంగాణకు ఎందుకంత ప్రాధాన్యం!

Sammakka Sagar Barrage Speciality: దక్షిణ గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఏపీ గుండా బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ నది గుండా ప్రవహించే నీటిలో ఎక్కువ శాతం సముద్రం పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో పోలవరం.. తెలంగాణలో పలు ప్రాంతాల్లో కీలకమైన తాగు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 16:14 IST | Updated: Nov 17, 2026, 16:24 IST
Image Credit: Sammakka Sagar Project (Source/AI)
Join

Sammakka Sagar Barrage: గోదావరి జలాలను తెలంగాణ అవసరాలకు వినియోగించుకునేందుకు సమ్మక్క సాగర్ బ్యారేజ్ కీలకంగా మారింది. 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరాను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఛత్తీస్‌గఢ్ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ (NOC), కేంద్ర ప్రభుత్వ అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో పూర్తి స్థాయి వినియోగానికి అడ్డంకులు ఎదురవుతున్నట్టు ప్రభుత్వం చెబుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎంతో జరిపిన భేటీతో ఈ ప్రాజెక్టుపై మరోసారి ఆశలు చిగురించాయి.

తెలంగాణలో గోదావరి జలాల వినియోగాన్ని అందులో మిగులు నీటి సామర్ధ్యాన్ని పెంచే ప్రాజెక్టుల్లో సమ్మక్క సాగర్ బ్యారేజ్ అతత్యం కీలకమైనది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఈ బ్యారేజ్ ద్వారా నీటిని నిల్వ చేసి వివిధ సాగునీటి పథకాలకు మళ్లించాలనేది ప్రభుత్వం అసలు లక్ష్యం. నిర్మాణం పూర్తయినప్పటికీ, పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి రావాల్సిన ఎన్‌ఓసీ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో సమావేశమయ్యారు. NOC ప్రక్రియను వేగవంతం చేస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంతకీ సమ్మక్క సాగర్ ప్రత్యేకతలేంటి..? తెలంగాణకు దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఎక్కడుంది..?

గోదావరి నదిపై తెలంగాణలోని ములుగు జిల్లా తుపాకులగూడెం సమీపంలో సమ్మక్క సాగర్ బ్యారేజ్ నిర్మించారు. గతంలో దీనిని తుపాకులగూడెం బ్యారేజ్‌గా పిలిచేవారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ పేరుతో సమ్మక్క సాగర్‌గా పేరు మార్చారు.

గోదావరి ప్రవాహాన్ని అందిపుచ్చుకుని అవసరమైన సమయంలో సాగునీటి పథకాలకు నీటిని అందించడమే ఈ బ్యారేజ్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యతను మెరుగుపరచడంతో పాటు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ ఆయకట్టుకు నీటి భరోసా కల్పించే  లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు.

ఈ బ్యారేజ్ నిర్మాణ పనులు 2018లో ప్రారంభమై 2022 నాటికి పూర్తయ్యాయి. సుమారు 1,143 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ బ్యారేజ్‌లో 59 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 83 మీటర్లు కాగా, గరిష్ఠ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు.

6.94 టీఎంసీల నిల్వ.. 46.96 టీఎంసీల నీటి మళ్లింపు..

సమ్మక్క సాగర్ ప్రాజెక్టులో రెండు  చాలా కీలకం. బ్యారేజ్‌లో ఒకేసారి నిల్వ చేయగల నీటి పరిమాణం 6.94 టీఎంసీలు. అయితే సాగునీటి అవసరాల కోసం గోదావరి నుంచి మళ్లించాలని ప్రతిపాదించిన నీటి పరిమాణం 46.96 టీఎంసీలు మాత్రమే. ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి. 6.94 టీఎంసీలు బ్యారేజ్ నిల్వ సామర్థ్యాన్ని సూచిస్తే, 46.96 టీఎంసీలు నీటిని మళ్లించే ప్రణాళికను అత్యంత కీలకమైనది. అంటే బ్యారేజ్‌లో ఒకేసారి 46.96 టీఎంసీలు నిల్వ ఉంటాయని కాదు. గోదావరిలో అందుబాటులో ఉండే నీటి ప్రవాహాన్ని ఉపయోగించుకుని అవసరాలకు అనుగుణంగా నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే నీటి ప్రవాహాం అనుగుణంగా నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టవచ్చు.

4.40 లక్షల ఎకరాలకు నీటి భరోసా ఎలా..?

సమ్మక్క సాగర్ నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ ఆయకట్టును స్థిరీకరించడం ఒకటి. వర్షాలు సరిగా కురవకపోవడం, నదిలో నీటి ప్రవాహం తగ్గడం వంటి పరిస్థితుల్లో సాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గోదావరి జలాలను నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని ప్రణాళిక రూపొందించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ రెండో దశ కింద సుమారు 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 2,34,199 ఎకరాలకు ప్రయోజనం కలగనుంది. మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాలు కలిపి మొత్తం 4.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరాను మెరుగుపరచాలనే ప్రణాళిక ఇందులో ఉంది. అయితే ఇక్కడ స్థిరీకరణ అంటే ఇప్పటికే సాగునీటి పరిధిలో ఉన్న భూములకు క్రమంగా  నీరు అందించడమే లక్ష్యం.

మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు..

సమ్మక్క సాగర్‌తో మరో కీలకమైన ప్రయోజనం కూడా ఉంది. రామప్ప–పాకాల లింక్ కెనాల్ ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని  ఈ ప్రాజెక్ట్‌లో  ప్రతిపాదించారు. ఇందులో ములుగు ప్రాంతంలో సుమారు 8 వేల ఎకరాలు, నర్సంపేట ప్రాంతంలో మరో 22 వేల ఎకరాలకు నీటిని అందించే లక్ష్యం ఉంది. ఈ కాలువ అందుబాటులోకి వస్తే ఇప్పటికే సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలకు మరింత నీటి భరోసా కల్పించనున్నారు. కొత్తగా మరికొన్ని భూములను సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.

దేవాదుల ప్రాజెక్టుకు సమ్మక్క సాగర్ ఎందుకు అవసరం..?

సమ్మక్క సాగర్ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలంటే దేవాదుల ఎత్తిపోతల పథకం గురించి తెలుసుకోవాలి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని భారీ పంపుల సహాయంతో ఎత్తిపోసి ఎత్తైన ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు అందిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే నీటిని సేకరించే ప్రాంతంలో తగినంత నీరు అందుబాటులో ఉండాలి.

గోదావరిలో ప్రవాహం తగ్గినప్పుడు నీటిని సేకరించడం, పంపింగ్ నిర్వహించడం సమస్యగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మక్క సాగర్ బ్యారేజ్‌లో నీటిని నిల్వ చేయడం దేవాదుల పథకానికి ఉపయోగపడుతుంది. నీటి లభ్యత మెరుగుపడితే పంపింగ్ కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా దేవాదుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీటిని అందించడంలో ఈ బ్యారేజ్ కీలకంగా మారుతుంది.

బ్యారేజ్‌కు ఛత్తీస్‌గఢ్ అనుమతి ఎందుకు అవసరం..?

సమ్మక్క సాగర్ తెలంగాణలో నిర్మించినప్పటికీ, నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి NOC ఎందుకు అవసరమనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి కారణం గోదావరి నది ప్రవాహం, బ్యారేజ్ నీటి నిల్వ వల్ల ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావం.

బ్యారేజ్‌లో నీటి మట్టం పెరిగినప్పుడు నదిలో నీరు వెనుకవైపు విస్తరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎగువ ప్రాంతాల్లోని భూములు, నివాస ప్రాంతాలపై ప్రభావం పడవచ్చు. సమ్మక్క సాగర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం నిర్వహిస్తే ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా భోపాల్‌పట్నం ప్రాంతంలోని కొన్ని భూములు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ముంపు సమస్యను పరిష్కరించకుండా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేమని ఛత్తీస్‌గఢ్ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం NOC కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ముంపు సమస్యపై తెలంగాణ ఇచ్చిన వివరణ ఏమిటి..?

ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం బ్యాక్‌వాటర్ ప్రభావంపై ప్రత్యేక అధ్యయనం చేయించింది. ఇందులో భాగంగా ఐఐటీ ఖరగ్‌పూర్ ద్వారా అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.9.883 కోట్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెల్లించింది.  అధ్యయనంలో వచ్చిన వివరాలను తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి తెలంగాణ వివరించింది. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం..  పూర్తి స్థాయి నీటిమట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాల భూమి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారీ వరదలు వచ్చిన సందర్భంలో కూడా ముంపు ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని ఆయన వివరించారు.

ప్రభావిత భూములకు పరిహారం చెల్లించడంతో పాటు, అవసరమైతే భూసేకరణ, పునరావాసానికి అయ్యే ఖర్చులను భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని క్లారిటీ . ఈ అంశాలపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరపడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తెలంగాణ భావిస్తోంది.

రేవంత్ రెడ్డి, విష్ణుదేవ్ సాయి భేటీలో ఏం జరిగింది..?

సమ్మక్క సాగర్‌కు సంబంధించిన అనుమతుల అంశాన్ని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.ఈ  రోజు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి భేటి అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బ్యారేజ్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన NOCను త్వరగా జారీ చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలో ఎన్‌ఓసీ ఇచ్చే అవకాశాలున్నాయి.


ఛత్తీస్‌గఢ్ అనుమతి వస్తే సరిపోతుందా..?

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి NOC రావడం ముఖ్యమైన ముందడుగు అయినప్పటికీ, ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ అనుమతుల ప్రక్రియ పూర్తవ్వాలి. నవంబర్ 13న సమ్మక్క సాగర్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను కేంద్ర జలశక్తి శాఖ మరిన్ని వివరాలు కోరుతూ తెలంగాణకు తిరిగి పంపినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత విస్తీర్ణంలో భూమికి సాగునీరు అందించనున్నారు, ఆయకట్టు వివరాలు ఏమిటి అనే అంశాలపై స్పష్టత కోరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అవసరమైన వివరాలను జోడించి DPRను తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి NOC పొందడంతో పాటు కేంద్ర స్థాయిలో మిగిలిన సాంకేతిక అంశాలు కూడా పరిష్కారమైతేనే ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

తెలంగాణకు ఏం లాభం..?

సమ్మక్క సాగర్ బ్యారేజ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణకు ప్రధానంగా వ్యవసాయం, నీటి నిర్వహణ రంగాల్లో ప్రయోజనం కలగనుంది. శ్రీరాంసాగర్ రెండో దశ కింద ఉన్న 4.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరాను మెరుగుపడుతుంది. రామప్ప–పాకాల లింక్ కెనాల్ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించే అవకాశాలున్నాయి. దేవాదుల ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటి లభ్యతను మెరుగుపరచడంలోనూ ఈ బ్యారేజ్ ఉపయోగపడుతుంది. సాగునీటికి ఉపరితల జలాలు అందుబాటులో ఉంటే బోర్లు, బావులపై ఆధారపడటం కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే స్థానిక ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశాలూ మెరుగుపడవచ్చు.

మొత్తానికి సమ్మక్క సాగర్ బ్యారేజ్ తెలంగాణకు మరో నీటి నిల్వ కేంద్రం మాత్రమే కాదు. గోదావరి జలాలను వ్యవసాయ అవసరాలకు సమర్థంగా వినియోగించుకునే కీలకమైన ప్రాజెక్టు. అయితే నిర్మాణం పూర్తయిందని వెంటనే అన్ని ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చినట్లు కాదు. ఛత్తీస్‌గఢ్ అనుమతులు, కేంద్ర స్థాయి ఆమోదాలు, అనుసంధాన పనులు పూర్తయినప్పుడే ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం నెరవేరుతుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES