Viral News: ఆటపాటలతో, స్నేహితులతో కలిసి బాగా ఆడుకోవాల్సిన వయసు అది.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ బాలుడి భుజాలపై కుటుంబ భారం పడింది.. తండ్రి అకాల మరణంతో రోడ్డున పడిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ఓవైపు బడికి వెళ్తూనే.. మరోవైపు ప్రాణాలకు తెగించి ఎత్తైన తాటిచెట్లు ఎక్కుతూ కల్లు గీస్తున్నాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థి చరణ్ అనే బాలుడు.. ఆ అబ్బాయి కథ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తూ వస్తోంది. అసలు ఏం జరిగింది? ఆ బాలుడు ఇలా ఎందుకు కష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మహబూబాబాద్ జిల్లా, ఈదులపూసపల్లి గ్రామ శివారులోని వేంనూర్ గ్రామానికి చెందిన ఉప్పలయ్య.. ఉమా దంపతులకు కుమారుడు చరణ్.. ఒక కుమార్తె ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది.. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న తండ్రి ఉప్పలయ్య ఇటీవలే మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా అనాథగా మారింది.. కుటుంబ పోషణ భారమంతా తల్లి ఉమాపై పడింది.. తల్లి పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన పదో తరగతి చదువుతున్న చరణ్.. తన చదువుకు ఆటంకం కలగకుండానే తల్లికి కొంతైన సహాయంగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట..
చరణ్ జీవితం రోజు కష్టాలతోనే మొదలవుతుంది.. తోటి పిల్లలంతా నిద్రలేవకముందే.. చరణ్ తెల్లవారుజామునే నిద్రలేచి మోకు, ముస్తాదు ధరించి ఎత్తైన తాటిచెట్లు ఎక్కుతాడు.. ప్రమాదకరమని తెలిసినా.. కడుపు నింపుకోవడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి కల్లు తీస్తాడట.. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లి ఎంతో శ్రద్ధతో చదువుకుంటాడట.. తిరిగి సాయంత్రం బడి గంట కొట్టగానే ఇంటికి వచ్చి.. పుస్తకాలు పక్కన పెట్టి మళ్లీ తాటిచెట్ల బాట పడతాడట.. ఇలా ఉదయం, సాయంత్రం కల్లు గీస్తూ.. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాడు.. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే.. తన చెల్లెలిని బాగా చదివించి ఉన్నత స్థాయికి చేర్చడమే తన జీవిత లక్ష్యమని చరణ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు..
ప్రస్తుతం ఈ నిరుపేద కుటుంబానికి ఉండటానికి సరైన సొంత ఇల్లు కూడా లేదట.. అరకొర ఆదాయంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఇంట్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారట.. ప్రభుత్వం తమ దయనీయ స్థితిపై స్పందించి.. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చరణ్, అతని తల్లి ఉమా వేడుకుంటున్నారు. చిన్న వయసులోనే ఇంతటి పెద్ద బాధ్యతలు మోస్తూ.. కష్టాలు ఎదుర్కొంటూ చరణ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని వేంనూర్ గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు..