SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tummidihatti Project: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన.. త్వరలోనే మహారాష్ట్రతో చర్చలు

Telangana CM Announces We Will Soon Discuss With Maharashtra CM: కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ నిర్మించాలని ప్రయత్నాలు చేస్తుండగా.. దీనిపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ బ్యారేజ్‌ నిర్మాణంపై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తామని ప్రకటించారు. చర్చలకు మహారాష్ట్ర సీఎం సానుకూలత తెలిపారని వెల్లడించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 23, 2026, 07:17 PM IST | Updated: Oct 23, 2026, 07:20 PM IST
Image Credit: Tummidihetti Project
Join

Telangana CM: తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ బ్యారేజ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో చర్చలు జరుగుతాయని.. దానికి సిద్ధంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 23వ తేదీ తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల తెలిపారని చెప్పారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి శుక్రవారం నీటి పారుదల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీటముడిగా ఉన్న అంశాలన్నింటినీ చర్చించారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని ముఖ్యమంత్రికి ఇంజనీర్లు వివరించారు. మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని అంచనా వేసుకొని సాధ్యమైనంత నీటిని తెచ్చుకునేందుకు వీలుగా బ్యారేజీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల అధికారుల సమావేశంలో జరిగిన వివరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని.. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారాన్ని అందించాలని సూచించారు.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరగాలని చెప్పారు. తుమ్మడిహెట్టి ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత.. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చే ప్రాజెక్టు రూట్ డిజైన్లు, భూసేకరణపై దృష్టి సారించాలని ఇరిగేషన్ ఇంజనీర్లకు సూచించారు.

మహారాష్ట్ర అంగీకరించినట్టు 148 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకునే వీల్లేదని.. అందుకే 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్రతో చర్చల సందర్భంగా తెలంగాణ నీటి అవసరాలను తెలిపి.. మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు చెప్పారు.

అనంతరం పాలమూరు, నల్లగొండ ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి, మంత్రులు, నీటి పారుదల శాఖ అధికారులు సమీక్షించారు. డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమయ్యే 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

పాలమూరు ప్రాజెక్టు నీటి అవసరాలకు ఎలాంటి కోత పడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాలమూరు నీటి కేటాయింపులకు ఆటంకం లేకుండా ఏదుల నుంచి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని అందించేలా పనులు చేపట్టాలని చెప్పారు. ఈ సందర్భంగా నార్లాపూర్ నుంచి డిండి, ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకోవాలనే అంశంపై మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చ చేశారు. దీనిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES