Telangana Elnino Effect: సాగునీరు లేక.. విద్యుత్ రాక రైతులు తీవ్ర కష్టాల్లో ఉండడంతో తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోభంలో మునిగింది. ఎక్కడికక్కడ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుండడంతో తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సమయంలో విద్యుత్ కోతలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్టకేలకు స్పందించారు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ గాడీ తప్పడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే 20 రోజులు అత్యంత కీలకమని.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్‌పై నిర్లక్ష్యం చేస్తే ఐఏఎస్‌లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వచ్చే జూన్ వరకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని తెలంగాణ సీఎం సూచించారు. తాగునీరు, పశుగ్రాసానికి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై బుధవారం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా పగలు రాత్రి విద్యుత్ సరఫరా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని నిలదీశారు. రానున్న రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను ముఖ్యమంత్రి ఆరా తీశారు.
'ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు' అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నిర్లక్ష్యం వహిస్తే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ సంబంధిత ఐఏఎస్‌లను సస్పెండ్ చేస్తానని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. విద్యుత్ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కోవిడ్ తరహా విపత్తుగా పరిగణించాలని సీఎం ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పుడు ముందస్తు చర్యలు చేపట్టకపోతే తీవ్ర సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు అని అభివర్ణించారు. మళ్లీ వర్షాలు పడేవరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వచ్చే జూన్ వరకు ప్రతి శాఖ పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని.. తాగునీటి సరఫరా సక్రమంగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు. పశువులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని.. పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అధికారుల నియామకం
ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్–1, గ్రూప్–2 స్థాయి అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్, తాగునీటి సరఫరా, పంటలు, పశుగ్రాసం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం, రాబోయే సంక్షోభ పరిస్థితులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దసరా తర్వాత దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు, విద్యుత్ పొదుపుతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగానికి సీఎం సూచించారు.