Deputy CM Bhatti Vikramarka Speech: జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గురు వందనం - 2026' టీచర్స్ అవార్డుల కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీలో అత్యవసర రాజకీయ కార్యక్రమాలు ఉన్నప్పటికీ, విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విద్యాశాఖను స్వయంగా తమ వద్దే ఉంచుకుని నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యాభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
ప్రభుత్వం నిర్వహించిన సోషియో - ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ (సిపెక్స్) సర్వే ఆధారంగా, సమాజంలో వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి కేవలం విద్య ద్వారానే సాధ్యమని శాస్త్రీయంగా నిరూపితమైందని వివరించారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రధాన విద్యారంగ సంస్కరణలు..
ఉపాధ్యాయుల నియామకాలు..
ప్రభుత్వం డీఎస్సీ (DSC) ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడంతో పాటు జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల నియామకాలను పూర్తి చేసిందని ఈ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు.
సంక్షేమం, పౌష్టికాహారం..
గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం వేళ ఉచిత అల్పాహారాన్ని అందించే పథకంతో పాటు, వారంలో ప్రత్యామ్నాయ రోజుల్లో పాలు, రాగి జావ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మోడల్ పాఠశాలల నిర్మాణం..
తెలంగాణ వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలు, ఇంగ్లీష్ మీడియం బోధన, క్రీడా మైదానాలు, అధ్యాపకుల నివాస క్వార్టర్లతో కూడిన 105 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను' ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. దీనికి తోడు ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి ఒక 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఉన్నత, సాంకేతిక విద్య..
మహిళా విశ్వవిద్యాలయానికి 'వీరనారి చాకలి ఐలమ్మ' పేరు పెట్టి ప్రత్యేక నిధులు కేటాయించారు. యువతకు తక్షణ ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో కంప్యూటరైజ్డ్ యంత్రాలపై నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక 'అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)' ను మంజూరు చేశారు.
2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా, విద్యార్థులను అద్భుతమైన మానవ వనరులుగా రూపుదిద్దడంలో ఉపాధ్యాయులందరూ భాగస్వాములు కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.