Telangana govt declares holiday for schools and govt offices on september 25: తెలంగాణలో గణపయ్య విగ్రహల నిమజ్జనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వినాయక నిమజ్జనం రోజు పలు జిల్లాల్లో వైన్ షాపులను బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవును ప్రకటించింది. అదే విధంగా..నవంబర్ 14 పనిదినంగా ఉంటుందని తెలిపింది.
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు.. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.
ఈ సెలవుకు బదులుగా 2026 నవంబర్ 14వ తేదీని (రెండో శనివారం) పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో (G.O.Rt.No.1396) పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మరొకవైపు ప్రశాంత వాతావరణంలో వేడుకలు పూర్తి కావడానికి వీలుగా వైన్ షాపులపై విక్రయాలపై ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అయితే.. ఇక్కడ స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులలోని బార్లకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహయింపును ఇచ్చారు. ఇక నిమజ్జనం రోజు బందో బస్తు కోసం భారీగా బలగాను జంట నగరాల పరిధిలో పోలీసులు మోహరించారు. ఏఐ టెక్నాలజీతో బందోబస్తును చేపట్టనున్నట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు.