DGP Meet: ప్రస్తుతం నేరాల రూట్ మారింది. ఒకప్పటిలా ఇంట్లో పడి దొంగతనాలు చేయడం అనేది తగ్గిపోయింది. ముఖ్యంగా ఎక్కడో ప్రపంచంలోని ఏ మూల కూర్చొని ఆన్‌లైన్‌లో బురిడి కొట్టిస్తున్నారు. ఇవన్నీ పోలీసులకు సవాల్‌గా మారాయి. ముఖ్యంగా సరిహద్దులు దాటి విస్తరిస్తున్న నేరాలను సమర్థంగా అరికట్టడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.
కేంద్ర పాలిత ప్రాంతాల డీజీల, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ విభాగాల అధిపతులు..
ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఐజీలు పాల్గొంటారు. వీరితో పాటే కేంద్ర నిఘా, భద్రత, దర్యాప్తు సంస్థలైన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్,ఎన్ఐఏ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ విభాగాల ఉన్నతాధికారులు సైతం హాజరుకానున్నారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖలు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలు, సమన్వయంతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వీరంతా చర్చించనున్నారు.
ఉగ్రవాదం, డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడి వ్యూహం..
ఈ సదస్సులో ప్రధానంగా ఉగ్రవాదం, మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిన అనంతర పరిస్థితులు, గంజాయి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర సైబర్ నేరాలు, ఆర్థిక, వ్యవస్థీకృత నేరాలు, మానవ అక్రమ రవాణాతో పాటు యువత నిరసనల వంటి కీలక అంశాలపై ఉమ్మడి కార్యాచరణను రూపొందించనున్నారు. అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టడం, నేరగాళ్ల సమాచారాన్ని రాష్ట్రాల మధ్య వేగంగా పంచుకోవడం, దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే మార్గాలపై ఈ సమావేశంలో సమీక్షిస్తారు.
మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు తీరు..
అలాగే దేశవ్యాప్తంగా ఇటీవల అమల్లోకి వచ్చిన మూడు నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరు, సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా చర్చించనున్నారు. నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను వాడుకుంటున్న నేపథ్యంలో.. దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు స్మార్ట్ పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగంపైనా ఉన్నతాధికారులు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకోనున్నారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఒకే వేదికపైకి వచ్చి ఇలా సమన్వయంతో పనిచేస్తే సరిహద్దులు దాటుతున్న నేరాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.