Indiramma Towers: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ మంత్రి శుభవార్త.. ఇందిరమ్మ టవర్స్‌పై కీలక అప్‌డేట్
Big Update On Indiramma Towers In Hyderabad: ఇల్లు లేని పేదలకు రూ.5 లక్షలకు నిర్మించి ఇస్తున్న ఇందిరమ్మ టవర్స్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా లబ్ధిదారులకు ఇల్లు అందించేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Indiramma Indlu Scheme: హైదరాబాద్‌లో ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ పేరిట ఇల్లు నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇళ్లకు దరఖాస్తులు స్వీకరించి.. లక్కీ డ్రాతో లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఈ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ ప్రజలకు మంత్రి శ్రీనివాస రెడ్డి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ టవర్స్ ఎప్పుడు ప్రారంభిస్తారోనని మంత్రి చెప్పారు.
హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్ పూర్తి చేసి లబ్ధిదారుల చేతికి తాళాలిస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ టవర్స్ వేగంగా నిర్మించే కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని నజరానా ఇచ్చారు.
తొలి విడత ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న లక్ష ఇళ్ల ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. ఏడాది గడువును కాంట్రాక్టర్లకు నిర్ధేశించామని.. ఒక నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ.90 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తామని వివరించారు. హైదరాబాద్‌లోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇందిరమ్మ టవర్స్‌ను నిరంతర ప్రక్రియగా నిర్మిస్తామని మంత్రులు చెప్పారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇళ్ల కోసం 7,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకోగా.. 5,218 మంది అర్హులుగా నిర్ధారించామని.. లక్కీ డ్రా ద్వారా 480 మంది లబ్ధిదారులను తుది జాబితాలో ఎంపిక చేసినట్లు మంత్రులు వెల్లడించారు. మరో మూడు విడతల్లోనూ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి చెప్పారు. ఇతర ప్రభుత్వ, హౌసింగ్ శాఖ భూములను గుర్తించి అక్కడ కూడా పేదలకు ఇళ్లు నిర్మించే చర్యలు చేపడతామని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. లబ్ధిదారులు కూడా తమ ఇళ్ల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
'మీ కళ్ల ముందే మీ ఇల్లు నిర్మించాలి. నాణ్యతతో కూడిన ఇంటిని సొంతం చేసుకున్నామనే తృప్తి, ఆనందం మీకు కలగాలి' అనేదే ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రులు స్పష్టం చేశారు. పేదల చిన్న చిన్న కోరికలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. పేదవాడి సొంతింటి కలను కేవలం హామీగా కాకుండా కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్, కలెక్టర్ మనూ చౌదరి తదితరులు పాల్గొన్నారు.