Bollarum Arms Theft Case: ఆయుధాలను దొంగిలించిన మాజీ హవల్దార్ మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించగా, అతని నుండి కీలక సమాచారం లభించింది. ప్రధాన నిందితుడైన మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని పూర్తి నేపథ్యాన్ని విచారించారు. అసలు ఈ ఆయుధాలు దొంగిలించిన తర్వాత అతను ఎవరితో కాంటాక్ట్‌లో ఉన్నాడు? ఆయుధాలు చోరీ చేయడానికి అసలు కారణం ఏమిటి? వంటి అంశాలన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఊడిమెల్లి గ్రామానికి చెందిన మల్లేష్, భారత సైన్యంలో చేరకముందే అమరా బాద్, అచ్చంపేట ప్రాంతాల్లో ఇళ్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2010లో ఆర్మీలోకి ఎంపికైనప్పుడు, తన పాత కేసుల గురించి అధికారులకు తెలియకుండా జాగ్రత్తపడుతూ ఇండియన్ ఆర్మీలో చేరాడు. కంటోన్మెంట్‌లో పోస్టింగ్ పొంది, అక్కడ వెపన్స్ బ్యారెట్‌లో బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడంతో అతనిపై పలుమార్లు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు.
2022లో కోల్‌కత్తా భారత్‌పూర్ కంటోన్మెంట్‌లో పనిచేస్తున్నప్పుడు, ఒక ఉన్నతాధికారిపై దురుసుగా ప్రవర్తించినందుకు అతన్ని సస్పెండ్ చేశారు. అక్కడే పనిచేస్తున్న సమయంలో యూనిట్ సమీపంలోని షాపుల యజమాని బీర్బల్ షాతో పరిచయం ఏర్పడింది. బీర్బల్ షా ద్వారా బంగ్లాదేశ్‌కు అక్రమంగా తుపాకులు సరఫరా చేసే అవల్దేవ్ ఎలియాస్ ఓబిని మల్లేష్‌కు పరిచయం చేశారు. మల్లేష్ రూ.10,000 ఇచ్చి ఒక తుపాకీని కొనుగోలు చేయడం, రాత్రి వేళలో దాన్ని చూపి దారిపోయే వారిని బెదిరించడం వంటి కేసుల్లో కూడా అతని పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గత ఏడాది జూన్లో బొల్లారంలోని మద్రాసు రెజిమెంట్‌కు బదిలీ కావడంతో, అతను వరంగల్‌లోని ఒక అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపర్వంలో తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించి, మరో స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 14 ఏళ్ల పాటు పని చేసిన మల్లేష్‌కు సైన్యంలో కేవలం మూడు ఏళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉంది. పర్యవసానంగా, అధికారులతో గొడవలు పడటం, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అధికారులపై ప్రతికారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఈ ఆయుధాల చోరీకి పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసింది. అంతర్జాతీయ సంస్థలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని, దొంగిలించిన ఆయుధాలను వారికి అప్పగించాలని ప్లాన్ చేసినట్లు కూడా తేలింది.
మల్లేష్ నేపథ్యం..
సైన్యంలో చేరేముందే పాత కేసులను దాచిపెట్టి రిక్రూట్ అయ్యాడు. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు దొంగతనం చేయడం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? ఉగ్రవాద సంస్థలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయా? ఈ ఆయుధాలను ఎవరికి అందించాలనుకున్నాడు? అనే అంశాలపై పోలీసులు కస్టడీలో విచారణ జరుపుతున్నారు. బంగ్లాదేశ్ ముఠాలతో ఇతనికి ఉన్న సంబంధాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇతర ఆర్మీ జవాన్ల పాత్ర ఉందేమోనని, మద్రాసు రెజిమెంట్‌లో ఇతనికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరెవరు సహకరించారు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒక వ్యక్తి ఒంటరిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను తరలించడం సాధ్యం కాదని, ఇందులో ఇతరుల ప్రమేయం కచ్చితంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు.
మల్లేష్ కోల్‌కత్తాలోని బీర్బల్ షాను సంప్రదించి, బంగ్లాదేశ్‌కు చెందిన ఓబికి ఆయుధాలను విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఒక తుపాకీని ఇప్పటికే ఓబికి అందించినట్లు తేలింది. నాలుగు AK-47 తుపాకులకు 5 లక్షలు, పిస్టళ్లకు మరో లక్ష రూపాయల చొప్పున బీర్బల్ షా కోరినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ కోసం బీర్బల్ షా ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఆయుధాలు ఉగ్రవాద సంస్థలకు చేరుతాయా అన్న కోణంలో పోలీసులు అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరో బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసును తెలంగాణ పోలీసులు, మిలిటరీ ఇన్వెస్టిగేషన్ టీమ్ కలిసి విచారిస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఢిల్లీ నుండి ఇంటెలిజెన్స్ టీమ్ కూడా వచ్చి, ఆయుధాల గదిని పగలగొట్టి ఆయుధాలు ఎలా మాయమయ్యాయనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది.