నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కారణంగా స్థానికులు తీవ్ర కలకలం, భయాందోళనకు గురవుతున్నారు. నిన్న అర్ధరాత్రి సుమారు 3: 20 సమయంలో, ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్ లోకి ఆరుగురు అనుమానితులు చొరబడ్డారు. వీరు లేక్ సైడ్ ప్రాంతంలో ఉన్న ఫెన్సింగ్‌ను కత్తరించి, సీ బ్లాక్ ప్లాట్ లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడాలని పక్కా ప్లానింగ్‌తో వచ్చారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఇక అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ టీవీ ఫూటేజీని పరిశీలించారు. ఈ వ్యక్తులు ఒంటిపై దుస్తులు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండటం గమనించారు. ఇటువంటి వేషధారణ హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లో వ్యవహరించే చెడ్డీ గ్యాంగ్ శైలిని పోలి ఉండటంతో, వీరు ఖచ్చితంగా ఆ గ్యాంగ్‌కు చెందినవారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నార్సింగి పోలీసులు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారిని పట్టుకోవడానికి తీవ్ర గాలింపు చర్యలు కూడా చేపట్టారు.
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ఫ్లాట్లు తిరుగుతూ దొంగతనాలు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, అక్కడి ఒక నివాసి వీటిని గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ దొంగలు సదరు వ్యక్తిపై ఆయుధాలతో భీకరంగా దాడి చేయడానికి ప్రయత్నించి, వెంటనే అక్కడి నుండి పారిపోయారు. ఈ గ్యాంగ్ బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీల రూపంలో వచ్చి, సులభంగా దోపిడీలు చేసి మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవచ్చని సమాచారం. వీరు కేవలం ఆస్తిని మాత్రమే కాకుండా, తమకు అడ్డువచ్చిన వారి ప్రాణాల మీదకు కూడా తెగించి దాడి చేసే ప్రమాదకరమైన ప్రొఫెషనల్ దొంగలుగా పేరుపొందారు.
ఈ గ్యాంగ్ ముఖచిత్రాలను, వారి కదలికలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్సింగి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు రాత్రి వేళల్లో తమ నివాస ప్రాంతాల్లో హై సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుతం పోలీసులు ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారు ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు?. ఎటువైపు వెళ్లారు? అనే అంశాలపై తీవ్రంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రజల రక్షణ దృష్ట్యా లేక్ సైడ్, నాలాలు వంటి ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.