Cyclone Murasu Work From Home: తెలంగాణ రాష్ట్రంలో మురసు తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తుపాను రాష్ట్ర సరిహద్దులను తాకగా అధికారులు ముందస్తు ఇప్పటికే జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా.. ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్నారు.
హైదరాబాద్‌లో వర్షాల అంచనా
రాజధాని హైదరాబాద్‌లో కూడా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. నవంబర్ 4వ తేదీ బుధవారం, 5వ తేదీ గురువారం రోజుల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్, బేగంపేట, హిమాయత్‌నగర్‌తో పాటు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రోడ్లు జలమయం అయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వర్షాల సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను అరికట్టడానికి, నగర రోడ్లపై ట్రాఫిక్ తీవ్రతను నియంత్రించడానికి సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఐటీ సంస్థలకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కార్యాలయాలకు వచ్చే ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వ్యవధిలో విడతల వారీగా లాగౌట్ కావాలని తెలిపారు. తద్వారా సిబ్బంది ఇబ్బందులు పడకుండా సురక్షితంగా ఇళ్లకు చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిపాదన
హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగస్తులకు రాబోయే రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) వెసులుబాటు కల్పించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై ప్రయాణ ప్రతిబంధకాలు నివారించడానికి, ఐటీ ఉద్యోగుల భద్రతను కాపాడటానికి ముందస్తుగా ఈ జాగ్రత్తలు ప్రకటించినట్లు వివరించారు.