Karthika Pournami: తెలంగాణ ఆలయాలకు కార్తీక పౌర్ణమి కాంతులు.. భక్తులతో కిటకిట
Devotees Heavy Rush To Temple For Karthika Pournami: ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన కార్తీకమాసంలో వచ్చిన పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో పూజలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ, వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక మంగళవారం కార్తీక పౌర్ణమి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేసిన భక్తులు ఉపవాస దీక్ష స్వీకరించారు. అనంతరం సాయంత్రం పూట ఆలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. మరికొందరు తులసీ మాతకు పూజించారు.
కీసరగుట్టకు కార్తీక శోభ
హైదరాబాద్ శివారులోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. కీసరగుట్ట భవానీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కీసర శివనామస్మరణతో మార్మోగింది.
కర్మన్‌ఘాట్ ఆలయంలో గవర్నర్ దంపతులు
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి జానకి శుక్లాతో కలిసి హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అంతకుము ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని, పరమశివుడు, శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయం, చిలుకూరు బాలాజీ ఆలయం తదితర శైవాలయాలు భక్తులతో నిండిపోయాయి. బోడుప్పల్‌లోని ఎన్‌ఐఎన్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర శివాంజనేయ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది . కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీకదీపం వెలిగిస్తూ భక్తులు శివకేశవులను ఆరాధించారు. తమకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక ముడుపు కట్టి పదకొండు ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని పలువురు భక్తులు చెప్పారు.