Tirumala Karthika Deepotsavam: కార్తీక మాసం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతుండగా.. ఈ క్రమంలో మంగళవారం కార్తీక పౌర్ణమిని భక్తులు భగన్నామస్మరణలో మునిగారు. పుణ్యస్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాస దీక్ష ఉండి భక్తిశ్రద్ధలతో మొక్కులు మొక్కుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు కార్తీక దీపోత్సవం చేశారు. కార్తీక దీపాల వెలుగుల్లో తిరుమల శోభాయమానంగా వెలుగులీనింది.
రుమల శ్రీవారి అలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తిచేసిన అనంతరం కార్తీక దీపోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు.
అనంతరం ఆ దీపాలను ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ.. ఆనంద నిలయంలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చారు. అనంతరం గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను టీటీడీ అర్చకులు వెలిగించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛారణలతో కార్తీక దీపారాధణ చేశారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ వెయ్యికి పైగా నేతి దీపాలతో దేదీప్యమానంగా వెలిగిన శ్రీవారి ఆలయం. 🪔🙏 #KarthikaDeepotsavam #KarthikaPournami #Tirumala #SrivariTemple #TTDofficialupdates https://t.co/Rqm0foZiTj
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) November 24, 2026
కార్తీకపౌర్ణమి వేళ శ్రీవారి ఆలయం కార్తీకదీపోత్సవ శోభను సంతరించుకుంది. దీపాల వెలుగుల్లో తిరుమల ఆలయం కొత్త అందం సంతరించుకోగా భక్తులు తన్మయత్వంతో పులకించారు. కాగా కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. కార్తీక దీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ, టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ భాస్కర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.