Karthika Pournami: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్‌లో ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులు ఆలయాలకు పోటెత్తడంతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కార్తీక దీపాలు వెలిగించి దైవ ప్రార్థన చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన వేములవాడలోని భీమేశ్వర ఆలయంతోపాటు కొండగట్టు ఆంజనే స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న స్వామి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణ, స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఆలయ పరిసరాల్లో పరిస్థితి అదుపు తప్పింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ క్యూలైన్ల కంచెలను తోసుకుంటూ భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. అయితే సరైన పోలీసు బందోబస్తు, ముందస్తు రద్దీ నియంత్రణ చర్యలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో దూరం నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చిన తమను ప్రధాన ద్వారం వద్ద నిలిపివేయడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
కొండగట్టు ఆంజనేయ స్వామి నిజరూప దర్శనంలో దర్శనమిస్తుండడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. సుమారు 60 సంవత్సరాల అనంతరం స్వామివారి నిజరూప దర్శనం, కార్తీక పౌర్ణమి, 47వ గిరి ప్రదక్షిణ ఒకే రోజు రావడంతో కొండగట్టుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పూజలు చేసిన అనంతరం స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 47వ గిరి ప్రదక్షిణలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో పాటు భక్తి భజనలతో కొండ చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణలో భాగంగా సీతమ్మ బావి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతమ్మ బావి నీటిని తలపై చల్లుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర జలంతో అంజన్న స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం ముందు ఉన్న రావి, వేప చెట్ల వద్ద భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
కార్తీక పౌర్ణమి వేడుకల్లో కేంద్ర మంత్రి
పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించిన సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. వ్రతంలో భాగంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేంద్ర మంత్రి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాన్ని వెలిగించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.