హైదరాబాద్‌ను కుమ్మేసిన వాన.. తడిసిన ముద్దయిన నగరం..
Hyderabad Rains: భాగ్యనగరాన్ని నిన్న వర్షాలు ముంచెత్తాయి. గత 35 రోజులుగా చినుకు లేక అల్లాడిపోయిన హైదరాబాదీలను కుండపోత వాన ముంచెత్తింది. సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సిటీలో నాన్ స్టాప్‌గా వర్షం దంచికొట్టింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జనం అల్లాడిపోతున్న వేళ రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. ఎల్బీనగర్ ఏరియాలో మొదటగా ప్రారంభమైన వర్షం క్రమంగా నగరమంతా విస్తరించింది.
Heavy Rains in Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు భాగ్యనగరం నడిబొడ్డైన పాతబస్తీలో వర్షం బీభత్సం స్పష్టించింది. అత్యధికంగా కీసరలో 11.2 సెం.మీ అత్యధిక వర్షపాతం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక బహదూర్ పూరాలో కేవలం గంటలోనే ఏకంగా 8.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్‌లో 7.65 సెం.మీ, మాదాపూర్ లో 7.38 సెంటీ మీటర్లు, షేక్ పేట గోల్కొండ పరిధిలో 6.68 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. మొత్తంగా హైదరాబాద్‌లోని మూడు కార్పోరేషన్ల పరిధిలో వర్షం కుమ్మేసిందనే చెప్పాలి.
రోడ్లపైకి వర్షపు నీరు..
వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సిటీలోని రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సరిగ్గా ఆఫీసులు ముగిసి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం దంచికొట్టడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 100 మీటర్ల దూరం ప్రయాణించాలంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పట్టింది. దీంతో ఐటీ ఎంప్లాయిస్ నరకయాతన అనుభవించారు.
ఈదురు గాలులతో కూడిన వర్షం..
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు.