డబ్బు ఆశ చూపి 43 మంది మహిళలకు వల.. అసలు గుట్టు బయటపెట్టిన పోలీసులు..!
Hyderabad Illegal IVF Racket: అక్రమ అండాల సేకరణ వ్యవహారం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని.. ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 43 మంది మహిళలను కాపాడారు.
Hyderabad Illegal IVF Racket: హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన అక్రమ అండాల సేకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా.. ఉద్యోగాలు, డబ్బు ఆశ చూపి ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు 43 మంది మహిళలను పోలీసులు రక్షించగా.. 8 మందిని అరెస్టు చేశారు. కుటుంబ పోషణ, అప్పుల బాధ, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ అక్రమ దందా సాగించినట్లు తెలుస్తోంది. ఈ దందా గత రెండేళ్లుగా సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మల్కాజిగిరి పోలీసులకు అందిన సమాచారంతో అక్టోబర్ 30న హైదరాబాద్‌లోని ప్రకాశ్ నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్ నగర్, గోపాలపురం ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. మహిళల హాస్టళ్లు, భవనాల్లో ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్, బీహార్ తదితర ప్రాంతాలకు చెందిన మహిళలను టార్గెట్‌గా చేసుకున్నట్లు తేలింది. వీరిలో ఎక్కువమంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. మహిళల అండాలను సేకరించి.. వాటిని అక్రమంగా విక్రయించడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించడమే ముఠా లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో బాధితులుగా ఉన్న మహిళల జీవితాల్లోని కష్టాలు తెలిస్తే ఈ ముఠా ఏ స్థాయిలో వారి పరిస్థితులను ఆసరాగా చేసుకుందో అర్థమవుతుంది. కోల్‌కతాకు చెందిన 25 ఏళ్ల మహిళ తండ్రి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన చికిత్స కోసం కుటుంబం రూ.3.5 లక్షల వరకు అప్పు చేసింది. అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరగడంతో ఆ మహిళ డబ్బు సంపాదించేందుకు ఈ ముఠా ఇచ్చిన ఆఫర్‌కు అంగీకరించింది. ఈ పని చేస్తే రూ.50 వేలు ఇస్తామని చెప్పినట్లు ఆమె వెల్లడించింది.
మహారాష్ట్రకు చెందిన మరో 25 ఏళ్ల మహిళ భర్త ప్రమాదం కారణంగా మంచానికే పరిమితమయ్యాడు. ఇంట్లో 75 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉండటంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమెపైనే పడ్డాయి. నెల రోజుల పని కోసం రూ.30 వేలు, రోజుకు నాలుగు పూటల భోజనం ఇస్తామని చెప్పడంతో హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపింది. కోల్‌కతాకు చెందిన మరో 30 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తె భవిష్యత్తు కోసం డబ్బు సంపాదించాలని భావించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ కుటుంబం తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితులను గమనించిన ఏజెంట్లు వారికి డబ్బు ఆశ చూపి ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ముఠా మహిళలందరికీ అసలు విషయం చెప్పకుండానే నగరానికి తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబైకి చెందిన 26 ఏళ్ల మహిళకు క్యాటరింగ్ పని ఉందని.. నెలకు రూ.40 వేలు చెల్లిస్తామని చెప్పారట. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతే అండాల సేకరణ కోసం తీసుకొచ్చినట్లు తెలిసిందని ఆమె వివరించింది. తమ ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లను కూడా ఏజెంట్లు తమ వద్దే ఉంచుకున్నట్లు బాధితులు తెలిపారు. పోలీసుల తనిఖీల్లో ఒక ఏజెంట్ వద్ద సుమారు 100 నకిలీ ఆధార్ కార్డులు లభించడం కేసులో కీలకంగా మారింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన మహిళల పేర్లతో ఈ కార్డులు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అండాల దాతలకు సంబంధించిన వయోపరిమితి, ఇతర నిబంధనలను తప్పించుకునేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.
ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి నగరంలోని 23 ఐవీఎఫ్ కేంద్రాల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళలకు హార్మోన్ల ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇచ్చినట్లు అనుమానాలు ఉండటంతో వాటి వినియోగం, వైద్య ప్రక్రియలపై ఆధారాలు సేకరిస్తున్నారు. దాడుల్లో ఇంజెక్షన్లు, సిరంజిలు, సూదులు, ఇతర మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అమిత్ శర్మను ప్రధాన నిర్వాహకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖత్ పర్వీన్ ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చే బాధ్యతలు చూసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను గుర్తించడం.. హైదరాబాద్‌కు తీసుకురావడం, వసతి కల్పించడం, వైద్య కేంద్రాలకు తీసుకెళ్లడం వంటి పనులను వేర్వేరు వ్యక్తులకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
భారత్‌లో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం-2021 ప్రకారం మానవ అండాలను విక్రయించడం లేదా బదిలీ చేయడం నిషేధం. ఈ చట్టం ప్రకారం అండాల దాత వయస్సు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక మహిళ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అండాలను దానం చేయాలి. ఒక ప్రక్రియలో గరిష్ఠంగా ఏడు అండాలను మాత్రమే సేకరించేందుకు అనుమతి ఉంది. అండాల సేకరణ ప్రక్రియ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు రక్షణగా దాతకు కనీసం 12 నెలల ఆరోగ్య బీమా కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను పక్కనపెట్టి కొందరు వ్యక్తులు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది..? ఎన్ని కేంద్రాలకు ఈ దందాతో సంబంధాలున్నాయి..? మహిళల నుంచి సేకరించిన అండాలను ఎక్కడికి తరలించారు..? అనే విషయాలు పోలీసులు దర్యాప్తులో వెల్లడికానుంది.