Khairtabad By Poll Tension 2026: తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికలు ఏవైనా సరే పట్టుసాధించాలని అధికార, ప్రతిపక్షపార్టీలు ఉవ్వీళ్లూరుతున్నాయి. ఊహించని విధంగా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుతో హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. సెప్టెంబరు 28 తేదీన ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని తెలంగాణ శాసనసభ సచివాలయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆరు నెలల వ్యవధిలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటామన్న తెలంగాణ రక్షణ సేన, జనసేన పార్టీలు..
ఖైరతాబాద్‌లో ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పోటీపై దృష్టిసారించారు . తెలంగాణ రక్షణ సేన ఖైరతాబాద్ బరిలో ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ప్రకటించింది. దీంతో ఉపఎన్నికలో పోటీ చేసే పార్టీల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు జర్నలిస్టుల సమస్యలను, ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేశారని, ఇంటిస్థలాలకు భూములు కేటాయించి, ఆ తర్వాత కోర్టు తీర్పుతో నాన్చుడు ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని 300 మంది జర్నలిస్టులు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్..
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ ఎత్తుగడలు తాజా పరిణామాల నేపథ్యంలో అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాజకీయ ఎత్తుగడలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసిన దానం నాగేందర్.. జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగబోతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నాయకులు ఖైరతాబాద్ స్థానం ఉప ఎన్నికల్లో కైవసం చేసుకోవాలని ప్రత్యేక దృష్టిసారించారు.
కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, విజయ, మానవతారాయ్ సన్నాహాలు..
ఎన్నికలు ఏవైనా సరే తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పి జనార్థనరెడ్డి కుటుంబీకులు పట్టుబడటం, పోటీలో నిలబడటం సర్వ సాధారణంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉంటున్న జనార్థన రెడ్డి కుమార్తె ఉప ఎన్నికల్లో పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, సీఎం రేవంత్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న మానవతారాయ్ ఖైరతాబాద్ స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కైవసం చేసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
సర్ ప్రాసెస్ తర్వాత తొలిసారి ఖైరతాబాద్ బై పోల్..
ఓటరు జాబితా సమగ్ర సవరణ తర్వాత తొలిసారిగా ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికలతోపాటు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలకు, ఇపుడు జరగబోయే ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
రేవంత్ సర్కార్‌కు మూడో ఉప ఎన్నిక..
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటిదాకా రెండు ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారు. రెండు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదే తరహాలో ఇపుడు జరుగబోతున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.
ఓట్లు తొలిగించడం హాట్ టాపిక్..
ఈ ఉప ఎన్నికలో ఓటర్ల జాబితా పరిశీలన అత్యంత కీలకమైన వ్యూహాత్మక అంశంగా మారింది. నియోజకవర్గంలో సుమారు ఒక లక్ష 23వేల మంది ఓటర్లకు SIR నోటీసులు జారీ చేయడం, పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపులు జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డ్రాఫ్ట్ నివేదిక ప్రకారం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. సవరణ ప్రక్రియకు ముందు ఈ నియోజకవర్గంలో 2 లక్షల 93 వేల 667 మంది ఓటర్లు ఉండగా, డ్రాఫ్ట్ జాబితా నాటికి ఆ సంఖ్య ఒక లక్షా 70వేల 195కు పడిపోయింది.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఒక లక్ష 23 వేల 472 ఓటర్ల పేర్లను డ్రాఫ్ట్ జాబితా నుండి మినహాయించారు. వీటిని ప్రధానంగా అందుబాటులో లేనివారు, చిరునామా మారినవారు, మరణించినవారు, రెండు చోట్ల ఓటు ఉన్న కేటగిరీల కింద గుర్తించి పక్కన పెట్టారు. త్వరలో జరగబోయే ఖైరతాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం నోటీసులు అందుకున్న వారి నుంచి ఆధారాల సేకరణ, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సవరణల అనంతరం నవంబర్ మొదటి వారంలో తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఖైతరాబాద్ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్ష..
ఖైరతాబాద్ లో జరిగే ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్ష కాబోతున్నాయి. రాజకీయ పార్టీలకు ఖైరతాబాద్ ఇపుడు హాట్ కేక్ గా మారింది. ఖైరతాబాద్ స్థానం గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టు సాధించవచ్చని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఖైరతాబాద్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించి, ప్రజలను మోసం చేశారనే నినాదంతో బీఆర్ఎస్ నాయకులు ఖైరతాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోడానికి శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించారు. వార్డుల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తలను, మద్ధతుదారులను కూడగట్టి ప్రజామద్ధతుతో ఉప ఎన్నికలను గెలవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఖైరతాబాద్‌లో ప్రధాన పార్టీలన్నింటికీ బలమైన క్యాడర్..
గ్రేటర్ పరిధిలో BRSకు బలమైన క్యాడర్ ఉంది. పార్టీని వీడిన నాయకులకు బుద్ధి చెప్పేందుకు, నియోజకవర్గంలో పట్టున్న తలసాని సాయికిరణ్ యాదవ్ గానీ, స్థానిక సీనియర్ కార్పొరేటర్లను బరిలోకి దించి తమ బలాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని మళ్లీ బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, BRSల మధ్య జరిగే ఓట్ల చీలిక తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఈ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టును ఉపయోగించుకుని విజయకేతనం ఎగరేయాలని చూస్తోంది.
అభ్యర్థుల ఎంపిక కంటే ముందు, తమకు అనుకూలమైన ఓటర్ల నమోదు, బూత్ స్థాయి వెరిఫికేషన్ ప్రక్రియలపైనే మూడు పార్టీలు ప్రస్తుతం ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. రాబోయే ఆరు నెలల్లో జరగబోయే ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా మారబోతుండటంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోనే కాదు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రాజకీయ పార్టీల వ్యూహాలపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.