Hyderabad Old Rupee Scam: హైదరాబాద్ పరిధిలోని రామాంతపూర్‌కు చెందిన గుమ్మ రమేష్ (39), ముదలే అనిల్ (19) అనే ఇద్దరు కేటుగాళ్లు పాత ఒక్క రూపాయి నోటుకు రూ. 45 లక్షలు ఇస్తామంటూ ఫేస్‌బుక్ ద్వారా బాధితుడిని సంప్రదించారు. అతడిని నమ్మించి విడతలవారీగా మొత్తం రూ. 7,93,351 కాజేశారు.
బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అమాయకుల బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డుల విక్రయం..
పోలీసుల విచారణలో నిందితులు సాగించిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ర్యాపిడో, ఉబర్ సంస్థల్లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసిన రమేష్, రామాంతపూర్ పరిసరాల్లోని విద్యార్థులు, డెలివరీ బాయ్స్, ఇతర అమాయక ప్రజలను సంప్రదించేవాడు. వారికి కమీషన్లు ఇస్తామని ఆశ చూపి వారి బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులను తీసుకునేవాడు.
అలా సుమారు 60 నుండి 70 మందికి చెందిన బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, సిమ్ కార్డులను సేకరించి, కొరియర్ ద్వారా హర్యానాలోని సైబర్ నేరగాళ్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది.
450 కేసులు, రూ. 70 కోట్ల స్కామ్..
సైబర్ నేరగాళ్లు ఈ ఖాతాలను 'మ్యూల్ అకౌంట్లు'గా (Mule Accounts) ఉపయోగించి సైబర్ నేరాల ద్వారా వచ్చిన నిధులను బదిలీ చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు విక్రయించిన ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన 450 సైబర్ క్రైమ్ కేసులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ. 60 కోట్ల నుండి రూ. 70 కోట్ల వరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.