Sankranti Sabarimala Special Trains 2027: ప్రస్తుతం శబరిమల యాత్రకు భక్తులు సిద్ధమవ్వగా.. సంక్రాంతి పండుగల సీజన్లలో రైళ్లలో రద్దీ భారీగా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఏ. శ్రీధర్ తెలిపారు. శబరిమల యాత్ర నేపథ్యంతో పాటు సంక్రాంతికి రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ మరికొన్ని ప్రత్యేక రాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ - మంగళూరు సర్వీసులు..
రైలు నంబర్ 07097 (హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్): ఈ రైలు డిసెంబర్ 2, 2026 నుంచి జనవరి 27, 2027 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. మొత్తం 9 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే రైలు నంబర్ 07098 (మంగళూరు సెంట్రల్ - హైదరాబాద్): తిరుగు ప్రయాణంలో ఈ రైలు డిసెంబర్ 3, 2026 నుంచి జనవరి 28, 2027 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఇది కూడా మొత్తం 9 సర్వీసులను అందించనుంది.
ప్రధాన స్టాప్‌లు: బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట్, కుప్పం, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, షోరనూర్, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ తదితర స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి.
ఛత్ పండుగ ప్రత్యేక రైళ్లు (దానాపూర్ - బెంగళూరు)..
ఛత్ పండుగ అనంతరం సొంతూళ్ల నుంచి తిరిగి వచ్చే వారి రద్దీని తగ్గించేందుకు బీహార్‌లోని దానాపూర్ నుంచి బెంగళూరు కంటోన్మెంట్‌కు రెండు వన్-వే స్పెషల్ రైళ్లు నడువనున్నాయి. అందులో భాగంగా రైలు నంబర్ 03241: నవంబర్ 19 (గురువారం) సాయంత్రం 6:00 గంటలకు దానాపూర్‌లో బయలుదేరి, నవంబర్ 21 (శనివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
రైలు నంబర్ 03245: నవంబర్ 20 (శుక్రవారం) సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరి, నవంబర్ 22 (ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది. వీటిలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ స్పెషల్ రైళ్లు ఆరా, బక్సర్, జబల్‌పూర్, నాగ్‌పూర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కాట్పాడి మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు నంబర్లు, వేళలు, ఆగే స్టేషన్ల వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.