SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad Rains: అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలి.. హైదరాబాద్‌లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి అప్రమత్తం

Telangana CM High Alert On Hyderabad Rains: వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడడంతో తెలంగాణ ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారు. భారీ నుంచి అతి భారీ వర్షం పడడంతో అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 22, 2026, 08:29 PM IST | Updated: Sep 22, 2026, 08:34 PM IST
Image Credit: Zee Telugu News
Join

Telangana CM High Alert: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా వాతావరణం పూర్తిగా వేడెక్కి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వరుణుడు రంగ ప్రవేశం చేసి ఊరటనిచ్చాడు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో దాని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షం పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం పడడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచనలు చేశారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించాలని సీఎం చెప్పారు.

వర్షం కారణంగా విద్యుత్‌ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ట్రాఫిక్ నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.

వర్షం నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సహాయార్థం కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తం
భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మాదాపూర్‌, హైటెక్‌సిటీ, రాయదుర్గం, ఐకియా చౌరస్తా, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, పటాన్‌చెరు, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదించాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES