Governor Quota MLC: ముదిరాజ్ కోటాలో ఎమ్మెల్సీ ఎవరికి..? రేసులో ఎవరు ఉన్నారు..
Governor Quota MLC in Telangana: రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రతిపక్షాలు వేగంగా పావులు కదుపుతున్నాయి..! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ సీట్లను రెడ్డి సామాజికవర్గానికి కేటాయించింది..! దాంతో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమాకాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం సాగుతోంది..! ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలికి ఓ ఎమ్మెల్సీ పోస్టు ఇస్తామని ప్రకటించారు. మరో రెండు పోస్టులను ఎవరికి ఇవ్వబోతున్నారు..! ఇందులో ఓ పోస్టును ముదిరాజ్ సామాజికవర్గానికి కేటాయిస్తున్నారా..! మరి ముదిరాజ్ కోటాలో ఎమ్మెల్సీ ఎవరికి దక్కబోతోంది..!
Governor Quota MLC in Telangana: రాష్ట్రంలో ఇప్పుడు బీసీ మంత్రం నడుస్తోంది. ప్రతిపక్షాల నుంచి అధికార పక్షం వరకు అంతా బీసీ పాలిటిక్స్ చేస్తున్నారు. బీసీ పల్లవిని ఎత్తుకుని కొందరు ఊరు.. వాడ తిరుగుతుంటే.. మరికొందరు.. బహిరంగ వేదికల్లోనే బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించేస్తున్నారు. అసలు విషయానికి వస్తే వచ్చే నెల అంటే నవంబర్ లో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. గతంలో బీఆర్ఎస్ నుంచి నామినేట్ అయిన గోరటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, బొగ్గరపు దయానంద్ పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు స్థానాలు ఎవరెవరికి దక్కుతాయన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సిరిసిల్ల పర్యటనలో చేసిన ప్రకటనతో బీసీ వర్గం నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇద్దరు ఎమ్మెల్సీలను బీసీలను చేస్తామని సీఎం ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కాబోయే ఆ ఎమ్మెల్సీలు ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక సిరిసిల్ల వేదికగా సీఎం రేవంత్ రెడ్డి.. తన ప్రకటనతో ఒక స్థానంపై స్పష్టత నిచ్చారు. బీసీల్లోని పద్మశాలి వర్గం నాయకుడిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తానని సీఎం స్పష్టం చేశారు. అయితే ఆ రెండో సామాజిక వర్గం నాయకుడు ఎవర్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో గణనీయమైన జనాభా కలిగిన ముదిరాజ్ వర్గానికి మరో సీటు కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నీలం మధు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నీలం మధు ఎమ్మెల్సీ పదవి కోరుతూ పీసీసీ అధ్యక్షుడిని, సీనియర్ ఏఐసీసీ నాయకులను కలిసినట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నుంచి ఆయనకు హామీ కూడా లభించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇతర పార్టీల్లో చూసినా కీలక నాయకుల సంఖ్య చాలా తక్కువ. బీజేపీలో అగ్రస్థానంలో ఉన్న ఈటల రాజేందర్, బీఆర్ఎస్ లో బండా ప్రకాష్, కాసాని ముదిరాజ్ లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక ముదిరాజ్ నాయకుల్లో మంత్రి వాకిటి శ్రీహరి ఒకరు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలనుకుంటే.. నీలం మధు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానానికి పోటీచేసిన నీలం మధు గెలుపుకు ఆమడ దూరంలోనే ఉండి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన బీజేపీ నాయకుడు రఘునందన్ రావుకు 4 లక్షల 71 వేల 217 ఓట్లు రాగా.. నీలం మధుకు 4 లక్షల 32 వేల 78 ఓట్లు వచ్చాయి. అంటే ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 39 వేల 139 మాత్రమే. రఘునందన్ రావుకు 34.11 శాతం ఓట్లు పోలవ్వగా.. నీలం మధుకు 31.27 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 2.84 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బలమైన నాయకుడిగా పేరున్న నీలం మధుకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం సముచితం అని సీనియర్లు యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. గతేడాది ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రకారం రాష్ట్రంలోని బీసీల్లో అత్యధికంగా ముదిరాజ్ లే ఉన్నట్లు స్పష్టమైంది. రాష్ట్ర జనాభాలో ముదిరాజ్‌ల 7.43 శాతం ఉన్నట్లు తేలింది. కులగణన సర్వేలో ముదిరాజ్‌లు, ముతరాసీలు, తెనుగోళ్లను ఒక కేటగిరీలో లెక్కించారు. దీంతో వీరి సంఖ్య 26.36 లక్షలుగా తేలింది. అటు ఓటర్ల విషయంలోనూ ముదిరాజ్ లు 5 లక్షల 50 వేల వరకు ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి దాంతో ముదిరాజ్ ల తర్వాత యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు 20.17 లక్షల మంది ఉండగా జనాభాలో వీరి వాటా 5.69 శాతం.
గౌడ సామాజిక వర్గం జనాభా 16.27 లక్షలు కాగా జనాభాలో వీరు 4.59 శాతంగా ఉన్నారు. అందుకే ఈసారి ఎమ్మెల్సీ పదవిని ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయిస్తే.. ఆ వర్గం నుంచి మరింత మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో నేతన్నల నుంచే ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పడంతో ఆ వర్గం నుంచి ఎవరిని నామినేట్ చేస్తారన్న చర్చ మొదలైంది. పద్మశాలి విభాగంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పున్న కైలాష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి.. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతోంది.