SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణను కరువులోకి నెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి..: టీ. జీవన్ రెడ్డి!

Jeevan Reddy News: తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే రాష్ట్రాన్ని కరువులోకి నెట్టేస్తున్నాడని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఉన్న సమస్యలను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 06, 2026, 04:45 PM IST | Updated: Nov 06, 2026, 04:47 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Jeevan Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న రాజకీయ కక్షతోనే, CM రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెడుతున్నారని మాజీ మంత్రి, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. జగిత్యాలలోని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌తో పాటు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు..

రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర కరువుతో అల్లాడుతోందని.. చివరకు విద్యాసంస్థలను మూసివేసి ఆన్‌లైన్ తరగతుల వైపు మొగ్గుచూపే దుస్థితి నెలకొందని.. జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. సముద్రం పాలవుతున్న 750 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వచ్చారు. KCR ఎంతో దూరదృష్టితో మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి.. కరువు సమయంలోనూ సాగు.. తాగునీరు అందించేలా వ్యవస్థను నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా కనీస మరమ్మతులు కూడా పూర్తి చేయలేకపోయిందని ఎద్దవ చేస్తూ వచ్చారు..

NDSA, కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థలు స్పష్టంగా నివేదిక ఇచ్చాయని ఆయన గుర్తుచేస్తూ వచ్చారు. మేడిగడ్డలోని 7వ బ్లాక్‌కు మాత్రమే మరమ్మతులు అవసరమని.. అన్నారంలోని 6 బ్లాకులతో పాటు సుందిళ్ల బ్యారేజీలు నాణ్యతా ప్రమాణాల ప్రకారం.. స్థిరంగా ఉన్నాయని పేర్కొన్న విషయాన్ని సీఎం పరిశీలించాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ దిగువన కేవలం రూ.100 కోట్ల వ్యయంతో నెల రోజుల్లో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే.. మేడిగడ్డ మరమ్మతులకు ఎలాంటి ఆటంకం కలగదని.. నెలకు 30 టీఎంసీల చొప్పున ఐదు నెలల్లో 150 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు వద్ద ఇసుక బస్తాలు వేసి నీటిని ఎత్తిపోసుకున్న మంత్రులు.. కన్నెపల్లి వద్ద మాత్రం ఎందుకు నిబంధనలు అడ్డుపెడుతున్నారని ప్రశ్నించారు.

రైతు సంక్షేమంపై మాట్లాడుతూ.. రైతు భరోసా నిధులు జమయ్యాయని ప్రభుత్వం ఫేక్ మెసేజ్‌లు పంపుతోందని.. బ్యాంకుల వద్దకు వెళ్తే ఖాతాల్లో చిల్లిగవ్వ కనిపించడం లేదని మండిపడ్డారు. ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ వద్ద నిధులు లేవని.. చెప్పడం సిగ్గుచేటని, రెయిన్ డ్రిప్ ఏర్పాటుకు ఎకరానికి రూ.30 వేల రాయితీతో పాటు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ.. జగిత్యాలలో పాత తహసీల్దార్ భవనాన్ని కూల్చివేసిన స్థలంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంతో.. పక్కనే ఉన్న రెండు ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఎలాంటి ఉపయోగం లేక ఖాళీగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బస్టాండ్ వద్ద వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలాన్ని నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగిస్తారని జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు BRS పోరాడుతుందన్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES