ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంపకం.. ఎక్సైజ్ అధికారులు ఏం చేశారంటే?
Peddapalli News: ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంచుతున్న ఓ నిందుతుడిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Peddapalli News: గ్రామీణ ప్రాంతాల్లో యువత మత్త పదార్థాలకు బానిసలు కాకుండా ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకున్నప్పటికీ.. కొంతమంది మాత్రం గంజాయి లాంటి మత్తు పదార్థాలను అక్రమంగా పండించి విక్రయిస్తూ వస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో గంజాయి సాగు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇంటికి చాలా దగ్గరలోనే ఉన్న పెరట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న ముఠాల అక్రమ వ్యాపారంపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా భారీగా గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సాగు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి తన నివాస ప్రాంగణంలోనే గంజాయిని అక్రమంగా సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది.. దీంతో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ తక్షణమే అప్రమత్తమై రంగంలోకి దిగింది. టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం కొత్తపల్లిలోని సదరు అనుమానిత నివాసంపై ఒక్కసారిగా మెరుపు దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది..
అధికారులు ఇల్లంతా తనిఖీ చేయగా.. పెరట్లో సాగు చేసిన పచ్చి గంజాయి మొక్కలతో పాటు.. కోసి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన ఎండిపోయిన మొక్కలును గుర్తించారు. ఈ దాడుల్లో నిందితుడి వద్ద నుంచి మొత్తం 8 ఎండిన గంజాయి మొక్కలతో పాటు.. రెండు పచ్చి గంజాయి మొక్కలను ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేసిన్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తూ.. యువతకు, స్థానికంగా ఉన్న ముఠాలకు చేరవేసే లక్ష్యంతోనే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
అయితే, నిందితుడిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.. అతనిపై ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌లో భాగంగా న్యాయస్థానంలో హాజరుపరిచిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో టాస్క్‌ఫోర్స్ ఏఈఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.