Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీకి కొత్త పేరు పెట్టిన బండి సంజయ్.. ఏమిటో తెలుసా?
Bandi Sanjay Slams To Revanth Reddy Comments On Sri Ram And Shiva: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొత్త పేరు పెట్టారు. ఐఎన్‌సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా అభివర్ణించారు. ఈ సందర్భంగా దేవుళ్లను విభజిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు.
Jammikunta: 'ఇటలీ నేషనల్ కాంగ్రెస్ డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే. కాంగ్రెస్ నేతల్లారా గాంధీ సంపన్నుడు కాబట్టే రాముడిని కొలిచారా? గాంధీ నోట నిత్యం రామ నామమే. జీవితాంతం హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించిన మహానీయుడు గాంధీ. కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకి' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. చిట్టచివరి పేదలకు సైతం ప్రభుత్వ ఫలాలు అందించాలని ఆరాటపడిన నాయకుడు గాంధీ అని కొనియాడారు. గాంధీ అసలు సిసలైన వారసుడు మోదీ, బీజేపీ అని బండి సంజయ్ ప్రకటించారు.
'కుటుంబ వారసత్వం, అవినీతి, హిందుత్వ ద్వేషం పుణికి పుచ్చుకున్న పార్టీ. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కారణం ముమ్మాటికీ కాంగ్రెస్సే. ముస్లిం ఓట్లతో కాంగ్రెస్ గెలవాలనుకుంటోంది. హిందూ ఓట్లను ఏకం చేస్తాం' అని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘గాంధీ నిత్యం పూజించిన రాముడు సంపన్నుల దేవుడా? లేక ప్రజలంతా నిత్యం తలచి కొలిచి ఆచరించాల్సిన ఆరాధ్య దైవమా?’ అని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పదవులను కాంక్షించిన మహనీయుడు గాంధీజీ కుటుంబ వారసత్వ, అవినీతిమయ రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. డూప్లికేట్ గాంధీ కుటుంబం మాత్రం దానికి భిన్నంగా వారసత్వ, అవినీతిమయ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గాంధీ హిందుధర్మాన్ని ఆచరించారని, ప్రస్తుతమున్న ఇటలీ నేషనల్ కాంగ్రెస్ మాత్రం.. హిందువులను చీల్చేందుకు కుట్రలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.
'గాంధీ పేరు చెప్పుకుని రూ.వేల కోట్లు సంపాదించి స్టార్ హోటల్ సౌకర్యాలను అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులు గాంధీ వారసులేనా?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మూమ్మాటికీ డూప్లికేట్ గాంధీ వారుసులేనని.. నిజమైన గాంధీకి పుట్టిన వాళ్లెవరూ అధికారాన్ని పంచుకోలేదని తెలిపారు. 'గాంధీ పేరును తగిలించుకున్న ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం మాత్రం గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అధికారాన్ని చెలాయిస్తూ కుటుంబ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ పార్టీని చెప్పుచేతల్లో తీసుకుని నడిపిస్తోంది' అని విమర్శించారు.
'గాంధీజీ కలలు కన్న రామరాజ్యాన్ని ఆచరణలో చూపుతోంది ఎవరు? అవినీతికి తావులేని, రాజు పేద అనే తేడా లేని పాలన అందిస్తున్నదెవరు? అట్టడుగునున్న పేదవాడికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్నదెవరు? ముమ్మాటికీ బీజేపీయే, నరేంద్రమోదీయే' అని బండి సంజయ్ వివరించారు. 'రోడ్డు మీద చెత్త, మనసులో ద్వేషం, రాజకీయాల్లో అవినీతి ఉండకూడదు అని గాంధీ చెప్పారని తెలిపారు. స్వార్ధం, కోపం, ద్వేషం, అహంకారాన్ని శుభ్రం చేసుకోవడమే గాంధీకి నిజమైన నివాళి అని కేంద్ర మంత్రి ్రకటించారు.
'హిందువులను చీల్చేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో కుట్ర చేస్తున్నాడు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ మార్పు రావాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 'ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు ముమ్మాటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సిందే' అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.