Boddemma Festival: తెలంగాణ నేలపై మాత్రమే కనిపిచే అరుదైన సంస్కృతి బొడ్డెమ్మ పండుగ..! భాద్రపద పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. 'బొడ్డెమ్మ' అంటే 'చిన్న పిల్ల' అని అర్థం. ముఖ్యంగా మూడేళ్లు లేదా ఐదేళ్ల బాలికలతో ఈ నోమును పట్టించి, యుక్తవయస్సు వచ్చేవరకు కొనసాగించడం ఇక్కడి ఆనవాయితీ. అమ్మమ్మ ఇంటివారు సమకూర్చే వస్తువులతో గౌరీదేవిని కొలిచే అత్యంత పవిత్రమైన పండుగ ఇది.
బొడ్డెమ్మను సిద్ధం చేసే విధానం ఎంతో పవిత్రమైనది. పుట్టమన్ను తెచ్చి, నీటితో తడిపి, పీటపై చతురస్రాకారంలో అమర్చి తొమ్మిది గుంటలు తయారు చేస్తారు. ఆ తొమ్మిది గుంటలను నవదుర్గలకు ప్రతీకగా భావిస్తూ వాటిలో బియ్యం పోస్తారు. ఆపై పసుపు గౌరమ్మను నిలిపి పూలతో, పసుపు కుంకుమలతో చిన్న పిల్లలతో పూజలు చేయిస్తారు. ప్రతిరోజూ ఎర్రమట్టితో పీఠాన్ని అలికి, రంగవల్లులు తీర్చిదిద్ది రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు.
సాయంత్రం కాగానే ప్రతి ఇంటి ఆవరణలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. సంధ్యా సమయంలో దేవతలు ఇంట ప్రవేశిస్తారనే నమ్మకంతో...బాలికలు, మహిళలంతా ఒక్కటై చప్పట్లు, కోలాటాలతో బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. "చిన్న చిన్న గుళ్ళు చిత్తారి గుళ్ళు...", "బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్ బిడ్డాలెందారే కోల్..." అంటూ జానపద బాణీలతో వీధులన్నీ మారుమోగిపోతాయి. ఆట ముగిశాక "నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా..." అంటూ అమ్మవారిని జోలపాటలతో ప్రసన్నం చేసుకుంటారు. భక్తుల ఆచారాన్ని బట్టి పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అని రకరకాల రూపాల్లో బొడ్డెమ్మను తయారుచేస్తారు. రూపాలు వేరైనా అమ్మవారిపై ఉండే భక్తి ఒక్కటే! తొమ్మిదో రోజు ఉదయం గుంటల్లోని బియ్యంతో తొమ్మిది కుడుములు తయారుచేసి గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు. తొమ్మిది రోజులు పూజించిన పూలను భద్రపరిచి, చివరి రోజు నోము నోచిన అమ్మాయి ముఖానికి పూయడం ఇక్కడి ప్రత్యేకం.
చివరి రోజు కొత్త గౌరమ్మను చేసి, అక్షింతలు, పూలతో పూజించి, మేళతాళాలతో స్థానిక చెరువులకు ఊరేగింపుగా బయల్దేరతారు. "పోయిరా బొడ్డెమ్మ పోయిరావమ్మా..." అంటూ సాగనంపుతూ చెరువు నీటిలో బొడ్డెమ్మను నిమజ్జనం చేయడంతో ఈ వేడుకలు పూర్తవుతాయి. మట్టిని, పకృతిని పూజిస్తూ, ఆడపిల్లల సౌభాగ్యాన్ని కాపాడే ఈ బొడ్డెమ్మ పండుగ.. బతుకమ్మ ఉత్సవాలకు నాందిగా నిలుస్తోంది.