Vizianagaram Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి హీటెక్కింది. నోటిఫికేషన్ వచ్చేయడంతో ఇటు అధికార కూటమి, అటు ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. రిజర్వేషన్లు ఫిక్స్ అయిపోవడంతో ఎవరిని ఎక్కడ రంగంలోకి దించాలనే విషయంపై ప్లాన్లు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయనగరం జడ్పీ పీఠంపై అందరి దృష్టి నెలకొంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిపి వైసీపీలో చక్రం తిప్పిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను.. ఇటీవల వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తన కుమార్తె మజ్జి సిరి సహస్ర భవిష్యత్ కోసం టీడీపీలో చేరిన ఆయన.. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కీలకం కానున్నారు. పార్టీలో ఎంతో ప్రాధాన్యం కల్పించినా.. రాజీనామా చేసిన వెళ్లిన చిన్న శ్రీనుపై ప్రతిపక్ష వైసీపీ గుర్రుగా ఉంది.
దీంతో ఆయనకు చెక్ పెట్టాలని ముందుగానే మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగా బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బొత్స అనూష పేరుపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి చిన్న శ్రీను కూతురు సిరిని పోటీలో నిలబెట్టినా.. అధికార కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు బొత్స అనూష సరైన అభ్యర్థి అని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న అనూష.. లోకల్గా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ తనదైన శైలిలో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. మండలాల వారిగా ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జడ్పీ ఛైర్పర్సన్గా బరిలోకి దించి.. పార్టీని విడిచి వెళ్లిన చిన్న శ్రీనుకు ఎలాగైనా బిగ్ స్ట్రోక్ ఇవ్వాలని వైసీపీ ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.
జడ్పీ పీఠం కోసం పార్టీ మారిన చిన్న శ్రీనును.. సరిగ్గా అదే స్థానంలో రాజకీయంగా దెబ్బ తీయాలని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న శ్రీనుకు గట్టి చెక్ పెట్టాలని బొత్స కుటుంబం నుంచి అభ్యర్థి ఉండాలని స్థానికంగా నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో బొత్స అనూష ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని.. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్లు విజయనగరం వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.