Telangana Farmers Yasangi Crisis: తెలంగాణ వ్యాప్తంగా వానాకాలం వరి కొతలు మొదలయ్యాయి. వచ్చే నెల నుంచి యాసంగి పంటల సీజన్ మొదలవనుంది.. అయితే పొలాల్లో పచ్చటి నాట్లకు బదులు రైతుల మొహాల్లో దిగులు, ఆందోళన కనిపిస్తోంది. ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని, దానికి బదులుగా ఆరుతడి పంటలైన పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటల వైపు మళ్లాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఏ పంట వేయాలో, ఎలా ముందడుగు వేయాలో పాలుపోక గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. నానాటికీ పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు రైతులకు పెద్ద శాపంగా మారాయి. వర్షాకాలం ముగియగానే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడం, అంతర్గత ప్రాంతాల్లో బావులు, బోరుబావులు వేగంగా ఎండిపోవడం మొదలైంది. నీటి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ఎక్కువగా నీటిని వినియోగించే వరి సాగు చేస్తే పంట చేతికి రాకుండా ఎండిపోయే ప్రమాదం ఉందని, అందుకే ఆరుతడి పంటలే శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు.
నీటి కష్టాలకు తోడు వేళాపాళా లేని కరెంట్ కోతలు రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో లో-వోల్టేజ్ సమస్యలు, తరచూ అయ్యే ట్రిప్పింగ్‌లు, అర్ధరాత్రి వేళల్లో ఇస్తున్న విద్యుత్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారు. రాత్రివేళల్లో పొలాలకు నీళ్లు పారించేందుకు వెళ్తూ పాముకాట్లు, ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరెంట్ కోతల వల్ల మోటార్లు కాలిపోవడం, సకాలంలో పంటలకు నీరందక వేసిన కొద్దిపాటి పైరు కూడా ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఒకవైపు విద్యుత్ సరఫరా సరిగా లేక, మరోవైపు నీటి మట్టాలు పడిపోయి ఒక్కో చేతిలో నాలుగైదు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో వేలాది రూపాయల అప్పులపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. యాసంగి వరి వద్దని చెబుతున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పంటలకు గ్యారెంటీ ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుతడి పంటలైన నువ్వులు, మినుములు, పెసర్లు, వేరుశనగ వేస్తే విత్తనాల లభ్యత ఎలా ఉంటుంది? తెగుళ్లు వస్తే నివారించే మార్గాలేంటి? తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందా లేదా? అనే స్పష్టత లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు.
ప్రభుత్వ ఆంక్షలు ఒకవైపు, ప్రకృతి సహకరించక నీటి కష్టాలు మరోవైపు, సరిగా లేని కరెంట్ సరఫరా ఇంకోవైపు తెలంగాణ అన్నదాతను ముప్పేట దాడిలా చుట్టుముట్టాయి. పంట వేస్తే నీళ్లు, కరెంట్ లేక ఎండిపోతుందనే భయం.. వేయకపోతే కుటుంబ పోషణ ఎలా అనే ఆందోళన పల్లెల్లో తాండవిస్తోంది.