AI Chatbot Data Privacy: ఏఐ చాట్‌బోట్లతో తస్మాత్ జాగ్రత్త! ఈ 5 పనులు అస్సలు చేయకండి..లేదంటే బుక్కైపోతారు!
AI Chatbot Data Privacy Tips: మన నిత్య జీవితంలో ఏఐ చాట్‌బాట్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈమెయిల్స్ రాయడం, ట్రావెల్ జర్నీ ప్లానింగ్స్, కష్టమైన విషయాలను సలహాలను స్వీకరించడం వంటి వాటి కోసం చాలా మంది ఏదో రకంగా వినియోగిస్తూనే ఉంటున్నారు. అయితే అలాంటి కృత్రిమ మేథా కలిగిన ఏఐ చాట్ బోట్‌లతో చాటింగ్ చేసే క్రమంలో వాటితో కొన్ని కీలక సమాచారాన్ని అస్సలు పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
AI Chatbot Data Privacy Tips: కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్లు మన దైనందిన పనులను సులభతరం చేస్తున్నప్పటికీ, వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిపుణుల సూచనల ప్రకారం చాట్‌బాట్లలో పొందుపరచకూడని ఐదు ప్రధాన అంశాలు ఇవే..
1) పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలు..
ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ పిన్‌లు, ఓటీపీలు (OTP), ఖాతాను పునరుద్ధరించుకోవడానికి వాడే రికవరీ కోడ్‌లను చాట్‌బాట్లలో ఎప్పుడూ నమోదు చేయకూడదు. ఖాతా లాగిన్‌లో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే, పాస్‌వర్డ్ వెల్లడించకుండానే ఆ సమస్యను వివరించి పరిష్కారం పొందవచ్చు.
2) బ్యాంకు, ఆర్థిక చెల్లింపుల సమాచారం..
బ్యాంకు ఖాతా నంబర్లు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల పూర్తి నంబర్లు, సీవీవీ (CVV) వంటి ఆర్థిక వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు. ఏదైనా లావాదేవీని అర్థం చేసుకోవాలన్నా లేదా ఖర్చులను లెక్కించాలన్నా వ్యక్తిగత వివరాలను తొలగించి, అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఇవ్వడం ఉత్తమం.
3) గుర్తింపు పత్రాలు (ఆధార్, పాస్‌పోర్టు మొదలైనవి)..
ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాల్లో పేరు, చిరునామా, ఫొటో, గుర్తింపు నంబర్లు వంటి కీలక వివరాలు ఉంటాయి. వీటిని అనవసరంగా చాట్‌బాట్లకు అప్‌లోడ్ చేయకూడదు. ఏదైనా పత్రాన్ని తప్పనిసరిగా విశ్లేషించాల్సి వస్తే, మొదట వ్యక్తిగత వివరాలను తొలగించాలి.
4) పనిచేసే ఆఫీసు రహస్య పత్రాలు..
మీరు పనిచేసే సంస్థల అంతర్గత నివేదికలు.. ప్రచురించని కథనాలు, క్లయింట్ల వివరాలు, రహస్య ఈమెయిల్స్‌ను సంస్థ అనుమతి లేకుండా ఏఐలో పెట్టరాదు. దీనివల్ల సంస్థ సమాచారం బహిర్గతమయ్యే ముప్పు ఉంటుంది. కార్యాలయ పనుల కోసం యాజమాన్యం అనుమతించిన సాధనాలనే వాడుతూ, అవసరమైనప్పుడు అసలు పేర్ల స్థానంలో సాధారణ ఉదాహరణలను ఉపయోగించాలి.
5) ఇతరుల వ్యక్తిగత వివరాలు..
స్నేహితుల వ్యక్తిగత సమస్యలు, సహోద్యోగుల జీతాలు, కుటుంబ సభ్యుల వైద్య రికార్డులను వారి అనుమతి లేకుండా చాట్‌బాట్లలో చర్చించకూడదు. సలహాలు లేదా పరిష్కారాలు కావాలనుకున్నప్పుడు పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు తీసివేసి సాధారణ రీతిలో మాత్రమే సమస్యను వివరించాలి.