Clear Vision vs Healthy Eyes: మనకు అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. చదవడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోయినా.. కళ్లలో నొప్పులు లేకపోయినా.. మన కళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని భావిస్తుంటాం. కానీ.. వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ నమ్మకం పూర్తిగా అవాస్తవం. గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతీ వంటి ప్రమాదకరమైన కంటి సమస్యలు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను బయటపెట్టవు. వయసుతో పాటు వచ్చే 'వెట్ ఏఎండీ' (మాక్యులర్ డీజెనరేషన్) సమయంలో సూటిగా ఉండే గీతలు కాస్త వంకరగా కనిపించడం వంటి చిన్న లక్షణాలతో ఇది మొదలవుతుంది.
కళ్లద్దాలు ఉన్నంత మాత్రానా..:
చాలామంది చూపు మసకబారితే కళ్లద్దాలు మార్చుకుంటూ సరిపెట్టేసుకుంటారు. గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల కేవలం పవర్ సమస్య మాత్రమే సరిదిద్దుతుంది. తప్ప, కంటిలో అంతర్గతంగా ఉన్న వ్యాధులు నయం కావు. ప్రారంభ దశలో ఉన్న గ్లకోమా లేదా రెటీనా సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ, కళ్లద్దాలతో అక్షరాలు స్పష్టంగానే కనిపిస్తాయి. అందుకే కళ్ల పవర్ చెక్ చేయించుకోవడం వేరు, కంటిలోని సమగ్ర భాగాలను పరీక్షించడం వేరని ముంబై ఏఎస్‌జీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సువీరా జైన్ స్పష్టం చేస్తున్నారు.
నిర్లక్ష్యం చేయకూడని హెచ్చరిక సంకేతాలు:
నడుస్తున్నప్పుడు ఇళ్లలోని తలుపుల అంచులను లేదా ఇతర వస్తువులను అకస్మాత్తుగా ఢీకొట్టడం.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు పక్కనుంచి వచ్చే వాహనాలను సరిగ్గా గమనించలేకపోవడం.
కిటికీలు లేదా తలుపుల గీతలు నిటారుగా కాకుండా వంకరగా కనిపియడం.
చూపు కేంద్రీకరించే మధ్య భాగంలో బూడిద రంగు మచ్చలు లేదా ఖాళీ ప్రదేశాలు ఏర్పడటం.
రాత్రి సమయాల్లో వాహనాలు నడపడం కష్టంగా మారడం, తక్కువ వెలుతురులో సరిగ్గా కనిపించకపోవడం.
హఠాత్తుగా కళ్ల ముందు నల్లటి చుక్కలు, దారాలు లేదా కాంతి మెరుపులు కదలడం.
డొంబివిలి ఎయిమ్స్ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ స్వాతి హిరే వివరిస్తూ.. మనిషి నేరుగా చూస్తున్నప్పుడు పక్క చూపు (పెరిఫెరల్ విజన్) క్రమంగా క్షీణించడాన్ని ఎవరూ అంత త్వరగా గుర్తించలేరని చెప్పారు. గ్లకోమా వంటి వ్యాధులలో ఈ నష్టం ఎలాంటి నొప్పి లేకుండా అత్యంత నెమ్మదిగా జరుగుతుంది.
తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు:
మధుమేహం (డయాబెటిస్), హై బ్లడ్ ప్రెజర్ ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా హిస్టరీ ఉన్నవారు మరియు 40 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.
ఎలాంటి సమస్య లేకపోయినా క్రమం తప్పకుండా పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ముఖ్యంగా స్టెరాయిడ్స్ ఉండే ఐ-డ్రాప్స్‌ను ఎప్పుడూ స్వయంగా వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కంటి చూపులో ఏమాత్రం తేడా గమనించినా వెంటనే నిపుణులను సంప్రదించి రక్షణ పొందడం ఎంతో ముఖ్యం.
Also Read: