Crispy Dosa Tips: మన నిత్య జీవితంలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ ఎంతగానో భాగమయ్యాయి. అయితే చాలామందికి సాదా ఇడ్లీల కంటే కరకరలాడే దోశలంటేనే మహా ఇష్టం. మన తెలుగు ప్రాంతాలతో పాటు దక్షిణాది వ్యాప్తంగా దోశలు వేసే ముందు పిండిలో చిటికెడు పంచదార కలపడం చాలామంది చూసే ఉంటారు. అసలు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం.
ఇంట్లో దోశలు వేస్తే.. హోటల్ మాదిరిగా బంగారు రంగులో.. కరకరలాడే గుణంతో రావడం లేదని చాలామంది బాధపడుతుంటారు. దీనికి పిండి తయారీ, పప్పుల కొలతలు మాత్రమే కాకుండా వంటింట్లో పాటించే చిన్న చిన్న చిట్కాలు కూడా ప్రధాన కారణం అవుతుంటాయి. ముఖ్యంగా, దోశ పిండిలో చిటికెడు చక్కెర వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
1. ఆకర్షణీయమైన రంగు కోసం:
పెనం వేడెక్కినప్పుడు పిండిలోని చక్కెర కరిగి.. అందులోని అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లతో ఒక ప్రత్యేకమైన రసాయనిక చర్య జరుపుతుంది. దీనినే సైన్స్ పరిభాషలో మైలార్డ్ రియాక్షన్.. కారామలైజేషన్ అంటారు. ఈ ప్రక్రియ కారణంగానే దోశలు తెల్లగా కాకుండా.. చూడటానికి ఎంతో ఆకర్షణీయమైన గోల్డెన్-రెడ్ కలర్‌లోకి మారుతాయి.
2. ఎక్కువ సేపు క్రిస్పీగా ఉండేందుకు:
ఇళ్లల్లో హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలను కోరుకునేవారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. వేడి తగిలినప్పుడు చక్కెర కరిగి ఒక పలుచని లేయర్‌లా ఏర్పడుతుంది. దీనివల్ల దోశ త్వరగా వేగి, మెత్తబడిపోకుండా చాలా సేపు కరకరలాడుతూ ఉంటుంది.
3. పులుపుదనాన్ని నియంత్రించడానికి:
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పిండి త్వరగా పాడైపోయి లేదా ఎక్కువగా పులిసిపోతుంటుంది. అలాంటప్పుడు దోశలు రుచికి చాలా పుల్లగా వస్తాయి. పిండిలో చిటికెడు చక్కెర కలపడం ద్వారా దోశలు తియ్యగా మారవు. ఆ పులుపుదనాన్ని బ్యాలెన్స్ చేసి సరైన రుచిని అందిస్తాయి.
4. కిణ్వ ప్రక్రియ వేగవంతం కావడానికి:
చలికాలంలో లేదా చల్లటి వాతావరణంలో పిండి త్వరగా పులవదు. అలాంటి సమయంలో పిండి రుబ్బేటప్పుడు కొద్దిగా చక్కెరను చేర్చితే.. అందులోని మంచి బ్యాక్టీరియాకు, ఈస్ట్‌కు అది చక్కటి ఆహారంగా పనిచేసి పిండి పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
మోతాదు ఎంత ఉండాలి?
పెద్ద గిన్నెడు పిండికి కేవలం అర స్పూన్ లేదా చిటికెడు చక్కెర సరిపోతుంది. మోతాదు దాటితే దోశలు తీపిగా మారడంతో పాటు పెనానికి అతుక్కుపోయి మాడిపోయే అవకాశం ఉంది. చక్కెర ఇష్టం లేనివారు కొద్దిగా బెల్లం పొడిని కూడా వాడవచ్చు.
ఎప్పుడు కలపాలి?
దోశలు పోయడానికి ఒక 5 నుంచి 10 నిమిషాల ముందు ఉప్పుతో పాటు పంచదారను పిండిలో కలపడం మంచిది. అలాగే, పిండి రుబ్బే సమయంలో కొద్దిగా మెంతులు లేదా శనగపప్పు నానబెట్టి వేసినా సహజంగానే అద్భుతమైన రుచితో పాటు మంచి రంగు వస్తాయి.
Also Read: