EPF Contribution Ceiling Limit: ఉద్యోగస్తుల పీఎఫ్ ఖాతాల్లో గత నెలకు సంబంధించిన నిధులు ఇంకా జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. సాధారణ నిబంధనల ప్రకారం ప్రతీ నెలా 15వ తేదీలోపు యాజమాన్యాలు మునుపటి నెలకు సంబంధించిన పీఎఫ్ సొమ్మును సంబంధిత ఉద్యోగి ఖాతాలో తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. అయితే వేతన పరిమితి రూల్స్‌లో మార్పులు రావడం వలన ఈ నెలకు సంబంధించిన జమ గడువును అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించారు.
ప్రతీ ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జీతం నుంచి నెలవారీగా 12 శాతాన్ని కట్ చేసి ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. దీనికి తోడుగా యాజమాన్యం కూడా తన వాటా కింద మరో 12 శాతాన్ని చెల్లిస్తుంది. సంస్థ చెల్లించే ఈ 12 శాతం మొత్తంలో 4 శాతం ఎంప్లాయర్ ఖాతాలో జమ కాగా, మిగిలిన 8 శాతం సొమ్ము పెన్షన్ అకౌంట్లో జమ అవుతుంది. కంపెనీలు ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చలాన్ కమ్ రిటర్న్ (ECR) దాఖలు చేయడం ద్వారా ఈ విరాళాలను చెల్లిస్తాయి. ఆపై ఇవి ఉద్యోగి ఖాతాకు చేరుతాయి.
నూతన వేతన పరిమితి, పేరోల్ మార్పులు..
కేంద్ర ప్రభుత్వం గరిష్ట పీఎఫ్ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన పరిమితి నిబంధన సెప్టెంబర్ 17వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. దీనివలన కంపెనీలు తమ పీఎఫ్ కాంట్రిబ్యూషన్లు, పేరోల్ సాఫ్ట్‌వేర్, రికార్డుల లెక్కల్లో సవరణలు చేసుకోవాల్సి వచ్చింది. యాజమాన్యాలకు ఈ మార్పులను పూర్తి చేయడానికి తగిన సమయం కల్పించే ఉద్దేశంతోనే ఈపీఎఫ్ఓ అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించింది.
జీతాలపై పడే ప్రభావం, కొత్త పరిమితులు
గతంలో రూ.15,000 గరిష్ట వేతన పరిమితి ఆధారంగా 12 శాతం చొప్పున రూ.1,800 వరకు పీఎఫ్ చందా కట్ అయ్యేది. ఇప్పుడు వేతన పరిమితి రూ.25,000 కు పెరగడంతో 12 శాతం చొప్పున పీఎఫ్ కటింగ్స్ రూ.3,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రతీ సంస్థ అనుసరించే పద్ధతి, ఉద్యోగి వేతనం, ఉద్యోగ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగి వాస్తవ వేతనం లేదా అధిక వేతనంపై ఇప్పటికే పీఎఫ్ లెక్కిస్తుంటే ఎలాంటి మార్పులు ఉండవు. కానీ రూ.25,000 లోపు జీతం ఉండి కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల చేతికి వచ్చే వేతనంలో మార్పులు కనిపిస్తాయి.