దీపావళి రోజు కేదారేశ్వర వ్రతం ఎందుకు ఆచరించాలి? దీని వెనుక ఉన్న పురాణ ప్రాముఖ్యత ఏమిటి?
Deepavali 2026: హిందూ సనాతన ధర్మంలో ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. సరిగ్గా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
Deepavali 2026: హిందూ సనాతన ధర్మంలో ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. సరిగ్గా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే.. ఈ ఏడాది నవంబర్ 8, 2026, ఆదివారం నాడు దీపావళి వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున సిరుల తల్లి లక్ష్మీదేవి పూజతో పాటు.. శివపార్వతుల కటాక్షం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కేదారేశ్వర వ్రతం ఆచరించడం మన సంప్రదాయంలో వస్తోంది.
పంచాంగ గణనల ప్రకారం.. ఈ రోజు ఉదయం 11:16 గంటలకు అమావాస్య తిథి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయం తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించడం ఎంతో శ్రేయస్కరం అని... ఇది భక్తులకు విశేష ఫలితాలను చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు. ఒకే రోజు దీపావళి వేడుకలు, లక్ష్మీ పూజలతో పాటు కేదారేశ్వర వ్రతం నోచుకోవడం వల్ల ఇంటా బయటా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
పురాణ గాథల ప్రకారం.. పరమశివుడి శరీరంలో సగభాగాన్ని (అర్థనారీశ్వర రూపం) దక్కించుకోవాలనే సంకల్పంతో పార్వతీదేవి స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ప్రతీతి. ఒకసారి భృగు మహర్షి కేవలం శివుడిని మాత్రమే దర్శించుకుని అమ్మవారిని విస్మరించడంతో పార్వతీదేవి మనస్తాపం చెందుతారు. ఈ సమస్యను నివారించేందుకు గౌతమ మహర్షి సలహా మేరకు అమ్మవారు కేదారేశ్వర వ్రతాన్ని నిష్టతో ఆచరించి పరమశివుడిని ప్రసన్నం చేసుకుంటారు. అమ్మవారి అంకితభావానికి మురిసిన శివుడు తన అర్ధభాగాన్ని ఆమెకు ప్రసాదించి 'అర్థనారీశ్వరుడు'గా మారుతారు. కుటుంబంలో అన్యోన్యత కోసం, కోరిన కోరికలు నెరవేరడం కోసం భార్యాభర్తలు ఇద్దరూ లేదా భక్తులు ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
పూజా సామగ్రి '21' సంఖ్య ప్రాధాన్యత:
ఈ వ్రతంలో '21' అనే సంఖ్యకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. పూజ కోసం కేదారేశ్వర స్వామి లేదా అర్థనారీశ్వర ప్రతిమ (లేదా శివలింగం), పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, దీపారాధన సామాగ్రి, ధూపం, కర్పూరం, పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా పూజలో 21 చొప్పున పూలు, పవిత్ర పత్రాలు, తమలపాకులు, వక్కలు సమర్పించాలి. నైవేద్యంగా 21 సంఖ్యలో బూరెలు లేదా అరిసెలను తయారు చేసుకోవాలి. అలాగే 21 పోగుల దారానికి పసుపు రాసి, 21 ముడులు వేసి తయారు చేసిన ప్రత్యేకమైన 'తోరం' ఈ పూజలో అత్యంత ప్రధాన ఘట్టం.
వ్రత నిర్వహణ విధానం:
పర్వదినం రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి.
ఇల్లు, పూజా మందిరాన్ని శుభ్రపరుచుకుని.. గదికి ఈశాన్య మూలన ప్రత్యేకంగా మండపాన్ని తీర్చిదిద్దాలి.
ఆ మండపంపై బియ్యం ఉంచి, దానిపై కలశాన్ని ప్రతిష్టించాలి.
పూజా కార్యక్రమం మొదటగా విఘ్నేశుడైన గణపతి పూజతో ప్రారంభమై, ఆ తర్వాత కేదారేశ్వర స్వామిని భక్తితో ఆవాహనం చేయాలి.
స్వామివారికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి, శివ అష్టోత్తరం లేదా కేదారేశ్వర స్తోత్రాలు పఠించాలి.
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాల పూలు, పత్రాలు, తమలపాకులు, వక్కలు సమర్పించి, 21 అరిసెలు లేదా బూరెలను నైవేద్యంగా నివేదించాలి.
పూజా ముగింపులో 21 ముడుల పవిత్ర తోరాన్ని కుడి చేతికి ధరించాలి.
అనంతరం సువాసినులకు లేదా బ్రాహ్మణులకు వాయనం, తాంబూలం, పండ్లు దానం ఇవ్వడంతో వ్రతం పరిపూర్ణమవుతుంది.
ఈ వ్రతం ఆచరించడం వల్ల ఇంటా బయటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలకాలం నిలుస్తాయని, దంపతుల మధ్య ప్రేమ, అనురాగాలు మరింత బలపడతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.