Diwali Fireworks Decibel Safety Limits: భారత చట్టాల ప్రకారం టపాసుల శబ్దం గరిష్ఠంగా 125 డెసిబుల్స్ (dB) వరకు ఉండవచ్చు. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల సంభాషణ 60 డెసిబుల్స్, రద్దీగా ఉండే రహదారి శబ్దం 85 డెసిబుల్స్ ఉంటుంది. ప్రతి 10 డెసిబుల్స్ పెరిగినప్పుడు శబ్ద తీవ్రత 10 రెట్లు పెరుగుతుంది. చట్ట ప్రకారం టపాసుల శబ్ద తీవ్రతను అవి పేలిన ప్రదేశానికి 4 మీటర్ల దూరంలో కొలుస్తారు.
అయితే శబ్దం వెలువడే ప్రదేశానికి దూరం సగానికి తగ్గిన ప్రతిసారీ దాని తీవ్రత సుమారు 6 డెసిబుల్స్ పెరుగుతుంది. 4 మీటర్ల దూరంలో 125 dB ఉన్న శబ్దం, 2 మీటర్ల వద్ద 131 dB, 1 మీటరు వద్ద 137 dB, అర మీటరు వద్ద 143 dB కి చేరుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఒక్కసారిగా వచ్చే శబ్దం గరిష్ఠ స్థాయి పెద్దలకు 140 dB, పిల్లలకు 120 dB మించకూడదు. అందువల్ల టపాసులను చేతిలో పట్టుకుని కాల్చడం ఎంతో ప్రమాదకరం.
చెవి లోపలి నిర్మాణం - శాశ్వత నష్టం
మన చెవిలోని కర్ణభేరి శబ్ద తరంగాలకు కంపిస్తుంది. ఈ కంపనాలు మూడు చిన్న ఎముకల ద్వారా లోపలి చెవిలోని 'కాక్లియా'కు చేరతాయి. కాక్లియాలో దాదాపు 15,000 సూక్ష్మ వెంట్రుకల్లాంటి కణాలు ఉంటాయి. ఇవి శబ్దాన్ని మెదడుకు చేరే సంకేతాలుగా మారుస్తాయి. టపాసులు దగ్గరగా పేలినప్పుడు ఈ సూక్ష్మ కణాలు దెబ్బతింటాయి. కర్ణభేరి చిట్లిపోయినా లేదా చిన్న ఎముకల కీళ్లు దెబ్బతిన్నా కొన్ని వారాల్లో కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ కాక్లియాలోని సూక్ష్మ కణాలు దెబ్బతింటే అవి తిరిగి పెరగవు, దీనివల్ల శాశ్వత వినికిడి లోపం ఏర్పడుతుంది.
అకౌస్టిక్ రిఫ్లెక్స్, ప్రతిధ్వని
పెద్ద శబ్దం వచ్చినప్పుడు చెవిలోని కండరాలు బిగుసుకుని లోపలి చెవికి చేరే కంపనాలను కొంతవరకు తగ్గించే వ్యవస్థను 'అకౌస్టిక్ రిఫ్లెక్స్' అంటారు. అయితే టపాసుల శబ్దం ఒక్కసారిగా గరిష్ఠ స్థాయికి చేరే 'ఇంపల్స్ నాయిస్' కావడం వల్ల చెవి రక్షణ వ్యవస్థ స్పందించేలోపే నష్టం జరుగుతుంది. అలాగే ఇరుకైన వీధుల్లో గోడల వల్ల శబ్దం ప్రతిధ్వనించి తీవ్రత మరింత పెరుగుతుంది. పది శబ్దాలు కలిస్తే తీవ్రత 10 డెసిబుల్స్ వరకు పెరుగుతుంది.
చెవుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
టపాసులు పేల్చే ప్రదేశానికి కనీసం 4 నుండి 5 మీటర్ల దూరంలో ఉండాలి. చేతిలో పట్టుకుని ఎప్పుడూ కాల్చకూడదు. పిల్లలకు, పెద్దలకు 20 నుండి 30 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని తగ్గించే ఫోమ్ ఇయర్ ప్లగ్స్ లేదా ఇయర్ మఫ్స్ ఉపయోగించాలి. దూది పెట్టుకోవడం వల్ల పెద్దగా రక్షణ ఉండదు.
చిన్న పిల్లలు, వృద్ధులు టపాసుల మోతకు దూరంగా ఇళ్లలోనే తలుపులు, కిటికీలు మూసి ఉండటం మంచిది. పండుగ తర్వాత చెవిలో నొప్పి, మోత లేదా రక్తస్రావం కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా, నూనె లేదా చుక్కల మందు వేయకుండా వెంటనే ఈఎన్‌టీ (ENT) లేదా ఆడియాలజిస్ట్ వైద్యుడిని సంప్రదించాలి.
(గమనిక: దీపావళి రోజు క్రాకర్స్ కాల్చే సమయంలో తప్పక ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు.)